‘పంచ’తంత్రం

24 May, 2016 03:05 IST|Sakshi
‘పంచ’తంత్రం

జిల్లాలో జోరుగా క్రికెట్ బెట్టింగ్, మట్కా, వ్యభిచారం, పేకాట, నంబర్‌గేమ్
మట్కా కింగ్‌ను అరెస్టు చేసినా మారని తీరు
మూడో కంటికి తెలీకుండా నంబర్‌గేమ్  
అసాంఘిక కార్యకలాపాలకు ‘అనంత’ అడ్డా  చోద్యం చూస్తున్న పోలీసులు

 
 
(సాక్షిప్రతినిధి, అనంతపురం) అనంత’ ‘పంచ’తంత్రంలో చిక్కుకుపోయింది. జూదాలు, అసాంఘిక కార్యకలాపాలు అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్నాయి.     క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట మాత్రమే కాదు.. కొత్తగా నంబర్‌గేమ్ వచ్చింది. ఇక వ్యభిచారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ఐదింటి దెబ్బకు వందలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.  కొందరు భారీగా అప్పులు చేసి ఆస్తులను అమ్ముకుంటుంటే... ఇంకొందరు ‘కాల్‌మనీ’ చేతుల్లో చిక్కి శల్యమవుతున్నారు.


ఆగని మట్కా
అనంతపురంలో మట్కా జోరుగా నడుస్తోంది. మట్కా కింగ్ మంగలి చంద్రను పోలీసులు అరెస్టు చేసినా అడ్డుకట్ట పడలేదు. తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలోనూ ఇదే పరిస్థితి. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కా  ఆరురోజులు నడుస్తోంది. ఈ మాట్కా నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా సాగుతోంది. కళ్యాణ్, సత్తా మట్కాలకు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీల డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతో చాలామంది మట్కా రాయుళ్లు సాయంత్రం నుంచి నంబర్ వచ్చేదాకా టెన్షన్‌తో గడుపుతున్నారు. అనంతపురం వన్‌టౌన్ పరిధిలో బీటర్లు అధికం. వారెవరన్నది పోలీసులకూ తెలిసినా బ్రేక్ వేయలేకపోతున్నారు. సత్సంబంధాలే ఇందుకు కారణం. టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలోనూ ఇదే పరిస్థితి.  ఈ ఊబిలో పడి వేలాది కుటుంబాలు నాశనమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు.


బెట్టింగ్‌కు అడ్డా
 క్రికెట్ బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు ‘అనంత’లోనూ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్నారు.  ఐపీఎల్ నేపథ్యంలో నెలన్నరగా బెట్టింగ్‌రాయుళ్లు భారీగా డబ్బు కోల్పోతున్నారు.  ఓ బంగారు వ్యాపారి నెలరోజుల్లోనే రూ.9లక్షలు, ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు. విద్యార్థులు కూడా కోచింగ్  ఫీజుల పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వచ్చి బెట్టింగ్ వేస్తున్నారు. మ్యాచ్ గెలుపోటములపై బుకీలు నిర్వహించే బెట్టింగ్‌తో పాటు ‘లైవ్’ ఉన్న సమయంలో లాడ్జీలో గ్రూపులుగా కూర్చొని బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్నారు. నెలన్నరలో రూ.30-40కోట్లదాకా బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది.


కొత్తగా నంబర్‌గేమ్
 ‘నంబర్‌గేమ్’ పేరుతో కొత్త వ్యసనం ‘అనంత’లోకి ప్రవేశించింది. కళ్యాణదుర్గం, బళ్లారి బైపాస్‌రోడ్లలో కొందరు గుంపులుగా చేరి ఈ గేమ్ ఆడుతున్నారు. రోడ్డుపై రాకపోకలు సాగించే లారీలు, బస్సుల నంబర్లు  కూడితే 20 ప్లస్ ఉంటుందని కొందరు, మైనస్ ఉంటుందని కొందరు బెట్టింగ్ కాస్తారు.  వేసవి కావడంతో వీరు బస్టాండ్, శ్రీకంఠం సర్కిల్‌లోకి మకాం మార్చారు. బస్టాండ్‌లోకి వచ్చే బస్సు నంబర్లపై పందేలు కాస్తున్నారు. దీంతో పాటు అంకెలపైనా బెట్టింగ్ వేస్తున్నారు.  0-9 వరకూ  ఓ అంకెను ఎంచుకుంటారు. వచ్చే వాహనంలో ఆ అంకె ఉంటుందని ఒకరు, ఉండదని మరొకరు పందెం కాస్తారు. దీని గురించి పోలీసులుకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

యథేచ్ఛగా వ్యభిచారం
 వ్యభిచారం అనంతతో పాటు తాడిపత్రి, గుంతకల్లులో జోరుగా సాగుతోంది. ‘అనంత’లోని శ్రీకంఠం సర్కిల్, బస్టాండ్ వద్దనున్న లాడ్జీలలో కొన్ని పూర్తిగా వ్యభిచారానికి అడ్డాగా మారాయి.  శారదానగర్‌లో ఓ మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్విహ స్తోందని సమాచారం. నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి అమ్మాయిలు వస్తారని తెలుస్తోంది. ఈ విషయం వన్‌టౌన్ పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. తాడిపత్రిలో ఇటీవల అరెస్టు చేసినా ఆగలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల వారు వచ్చి పనిచేస్తున్నారు. వారు నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారిని ఆసరాగా చేసుకుని బుగ్గ సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

పేకాట పాపారావులు ఎక్కువే..
 అనంతలో పేకాటరాయుళ్లు ఎక్కువగానే ఉన్నారు.  చాలామంది జిల్లా నుంచి కర్ణాటక ప్రాంతాలకు కూడా వెళుతున్నారు.  జిల్లాలోని మిడ్‌పెన్నార్‌డ్యాం, పెన్నహోబిలం, పెనుకొండ వద్ద స్థావరాలున్నాయి. వీరిలో పోలీసుకానిస్టేబుళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇద్దరు గన్‌మెన్లు పేకాట ఆడే కానిస్టేబుళ్లకు వడ్డీకి అప్పులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు