ఖమ్మం టు ఇంగ్లండ్... వయా ముంబై

31 Jan, 2014 10:22 IST|Sakshi
ఖమ్మం టు ఇంగ్లండ్... వయా ముంబై

* జడలు విప్పుతున్న బెట్టింగ్ మాఫియా
*  జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు  మ్యాచ్  జరిగితే రూ.5కోట్లు తారుమారు
*  చేతులు మారుతున్న వందల కోట్ల రూపాయలు
*  హాట్‌లైన్, ఫేస్‌టుఫేస్ పేరుతో పందేలు
* లక్షలాది రూపాయలు నష్టపోతున్న యువత
*  రాజకీయ నాయకులు, బడాబాబుల నుంచి సామాన్యుల వరకు అదే బాట
*  ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి వ్యసనాలకు లోనవుతున్న  వైనం
 
ఖమ్మం:  ఖమ్మం మార్కెట్‌లో స్విచ్ వేస్తే ఎక్కడో ఉన్న లండన్‌లో లైటు వెలుగుతోంది. ఇక్కడ ఊ.. అంటే ముంబైలో పచ్చనోట్లు రెపరెపలాడుతున్నాయి. ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా...జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌ల మహిమ. యువకులు, వ్యాపారులు, రాజకీయనాయకులు ఎందర్నో కట్టిపడేసి నిలువునా ముంచేస్తున్న ఈ వ్యసనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

 వ్యసనపరుల బలహీనతను ఆసరాగా చేసుకున్న బెట్టింగ్ మాఫియా జిల్లాలో జడలు విప్పుతోంది. ట్వంటీ20, 50ఓవర్ల మ్యాచ్‌లు, లీగ్‌మ్యాచ్‌ల పేరుతో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతున్నాయి. ఇందుకు లండన్ ప్రధాన వేదికగా, ముంబై మాఫియా కనుసన్నల్లో ఆన్‌లైన్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఫలానా ఓవర్ వరకు ఇన్ని పరుగులు కొడతారని, మొత్తం ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు కొడతారని, ఫలానా జట్టు గెలుస్తుందని పందేలు కాస్తున్న వారు.. ముఖ్యంగా యువతరం బెట్టింగ్ మోజులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

ఈ బెట్టింగ్‌లో రాజకీయ నాయకులు, బడాబాబులు,  విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఒక్కమ్యాచ్ జరిగితే... జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ రూపంలో రూ.5 కోట్లు చేతులు మారుతున్నాయంటే   పందేల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలే కాదు...మండల కేంద్రాలకు కూడా బెట్టింగ్ మాఫియా విస్తరించింది.  ఈ బెట్టింగ్‌ల రూపంలో ఇప్పటికే జిల్లాలో వందల కోట్ల రూపాయలు మార్పిడి జరిగిఉంటుందని అంచనా. ఈ జూదంలో వందలాది మంది జీవితాలు బలయిపోతున్నాయి.

సునాయసంగా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో లక్షల రూపాయలు పందేలు కాసి పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పులపాలై మానసిక వ్యథకు గురయిన వీరు పలు వ్యసనాలకు కూడా బానిసలవుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాల తరహాలో బెట్టింగ్ నడుస్తున్నా నియంత్రించడంలో పోలీసు శాఖ విఫలమయిందనే భావన ప్రజల్లో నెలకొంది.  
 
 బెట్టింగ్ కడతారిలా....!
ఈ బెట్టింగ్ ప్రక్రియ చాలా పక డ్బందీగా జరుగుతుంది. ట్వంటీ20 నుంచి ఎలాంటి మ్యాచ్ జరిగినా హాట్‌లైన్ ఓపెన్ అయిపోతుంది. ముందుగా మ్యాచ్ ప్రారంభం కాగానే 10 ఓవర్లకు బ్యాటింగ్ జట్టు ఎంత స్కోరు చేస్తుందనేది నిర్ధారించి ఆ స్కోరుపై బెట్టింగ్ కాస్తారు. నిర్వాహకులు ఇంత స్కోరు చేస్తుందని చెపితే బెట్టింగ్ చేసేవాళ్లు ఎస్ ఆర్ నో చెప్పాలి. దానిని బట్టి 10 ఓవర్లు పూర్తయిన తర్వాత గెలుపోటముల ఆధారంగా అప్పటికే వారి వద్ద ఉన్న నగదు నుంచి మినహాయించుకోవడం లేదా బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం  జరుగుతుంది. ఆ తర్వాత 25, 35, 50 ఓవర్లకు, మరలా ఇన్నింగ్‌స్కోరుకు, ఆ తర్వాత మ్యాచ్ ఫలితంపై... ఇలా పలు దశల్లో మ్యాచ్ పూర్తయ్యే వరకు ఈ బెట్టింగ్ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఒక పందెం ఓడితే ఆ డబ్బులు రాబట్టుకోవాలని, గెలిస్తే మరిన్ని డబ్బులు సంపాదించాలని జూదరులు ఈ బెట్టింగ్‌లో మ్యాచ్ పూర్తయ్యేంతవరకు పాల్గొంటూనే ఉంటారు.
 
ఇక ట్వంటీ20 మ్యాచ్‌లో అయితే తొలుత 6ఓవర్లకు, ఆ తర్వాత ఇన్నింగ్స్ స్కోరు, మరలా మ్యాచ్‌ఫలితంపై బెట్టింగ్‌లుంటాయి. హాట్‌లైన్ పద్ధతిలో ఇలా ఉంటే.... ఇక ఫేస్‌టుఫేస్ బెట్టింగ్‌ల పేరిట మరో రకం పందేలు నడుస్తున్నాయి. తెలిసిన వ్యక్తుల మధ్య జరిగే ఈ బెట్టింగ్‌లలో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే, ఈతరహా బెట్టింగ్‌లు మాత్రం మ్యాచ్ ఫలితం పైనే ఎక్కువగా సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లాలో వందలాది మంది బుకీలున్నట్లు సమాచారం. వీరికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న బుకీలతో సంబంధాలున్నాయని, నిత్యం వారిని సంప్రతిస్తూ బె ట్టింగ్‌లు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని  సమాచారం. వీరి గురించి పోలీసులకు తెలిసినా ఏమీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
 
 జూదంలో కోల్పోయి... ఇతర వ్యసనాలకు బానిసలై...
ఈ బెట్టింగ్ జూదంలో జిల్లా ప్రజలు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. యువకులు ఇంట్లో డబ్బులు దొంగిలించి పందేలు కాస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన మోటారు బైక్‌లను సైతం ఫైనాన్స్‌లలో తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులది కూడా ఇదే పరిస్థితి. కొందరు బడాబాబులు అయితే లక్షల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఒక్కోరోజు దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకున్న లేదా సంపాదించిన సందర్భాలు కూడా ఉంటాయని, అయితే ఎక్కువగా డబ్బు పోగొట్టుకోవడమే జూదం ప్రధాన లక్షణమని బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోయిన ఓ వ్యాపారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా డబ్బులు పోగొట్టుకున్నామనే బాధతో యువకులు కొన్ని వ్యసనాలకు కూడా లోనవుతున్నారు. తాగుడు, మత్తుమందు లాంటి వాటికి బానిసలయి అటు కుటుంబాలను, ఇటు తమ వ్యక్తిత్వాన్ని బజారుకీడ్చుకుంటున్నారు.
 
 ఖాకీలేం చేస్తున్నారు?
కోట్ల రూపాయలు చేతులుమారే బెట్టింగ్ రాకెట్ జెట్‌స్పీడ్‌తో దూసుకెళుతుంటే అరికట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుకీల సమాచారం, బెట్టింగ్ వ్యవహారం పక్కాగా తెలిసినప్పటికీ పోలీసు శాఖ చేష్టలుడిగిందనే విమర్శలున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, అసలు తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఖాకీలు బుకీల మధ్య ఏదైనా ‘అవగాహన’ఉండి ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎప్పుడో ఓ నలుగురుని అరెస్టు చేసి బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పే పోలీసులు ఆ తర్వాత అసలు ఆ వైపు దృష్టి కూడా సారించడంలేదు. పందేల రూపంలో లక్షల రూపాయలు కోల్పోతున్న యువత భవిష్యత్తు నాశనమయిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో... విధినిర్వహణలో చురుకుగా, కఠినంగా వ్యవహరిస్తారనే పేరు సంపాదించుకున్న జిల్లా పోలీస్‌బాస్ అయినా కలగజేసుకుని ఈ బెట్టింగ్ జాఢ్యం నుంచి జిల్లా ప్రజలను విముక్తులను చేయాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

మరిన్ని వార్తలు