క్రికెట్ ఫీవర్

15 Feb, 2015 01:35 IST|Sakshi
క్రికెట్ ఫీవర్

నేటి దాయాదుల పోరుపై సర్వత్రా ఉత్కంఠ
నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు
టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు

 
విజయవాడ స్పోర్ట్స్ : నగరానికి ఒక్కసారిగా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఒక్కడ చూసినా టీమిండియా చరిత్రను రిపీట్ చేస్తుందా.. పాకిస్తాన్ చరిత్రకు చెక్ పెడుతుందా.. అనే చర్చసాగుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  దేశాలు ఆతిథ్యమిస్తున్న పదో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ శనివారమే ప్రారంభమైంది. అయితే, ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే దాయాదుల పోరుపైనే అందరి దృష్టి నెలకొంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు నగర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రీడాభిమానుల కోసం నగరంలోని ముఖ్య హోటళ్లు, క్లబ్‌లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటుచేశారు. టీమిండియా గెలుపొందాలని అభిమానులు పలు ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా కూడా పూజలు నిర్వహించారు.

చరిత్ర రిపీట్ కావాలని...

ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాపై ఈసారి పెద్దగా అంచనాలు లేవు. అయినప్పటికీ పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.  క్రికెట్ ప్రపంచ కప్ ప్రాంభించిన 1975 నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్‌పై ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోలేదు. ఇటీవల టీమిండియా క్రికెటర్లు ఫాం కోసం తంటాలు పడుతున్నారు. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి చరిత్ర పునరావృతం చేస్తుందా.. లేక పాకిస్తాన్ విజయం సాధించి సరికొత్త చరిత్రకు  శ్రీకారం చుడుతుందా.. అనే అంశంపై సర్వత్రా చర్చనడుస్తోంది. ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం విజయవాడ క్లబ్, ఎగ్జిక్యూటీవ్ క్లబ్, పెద్దపెద్ద హోటల్స్‌లో క స్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొంది సెమీస్ వరకు చేరితే నగరం నుంచి ఆస్ట్రేలియాకు ప్రయాణం కట్టేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.
 
జోరుగా బెట్టింగ్‌లు..!

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉంటాయి. అదే తరహాలో పందేలు, బెట్టింగ్‌లకు తెరతీయనుంది. నగరంలోని బెట్టింగ్ రాయుళ్లు ఇప్పటికే తమ ఏజెంట్ల ద్వారా పందేలు ప్రారంభించారు. గెలుపు, ఓటములపైనే కాకుండా క్రీడాకారుల వ్యక్తిగత పరుగులు, వికెట్లు.. ఇలా రకరకాలుగా పందేలు కాస్తున్నారు. రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరంలో ట్రాఫిక్ పెరగడంతో విసిగెత్తిపోతున్న ప్రజలకు బహుశా ఆదివారం పగలంతా కాస్తంత ఉపశమనం కలగవచ్చు. దాయాదుల పోరు జరుగుతున్నంత సేపూ ఎవరూ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు.
 

>
మరిన్ని వార్తలు