పోలీసుల కళ్లుగప్పి.. ఖైదీ పరారీ

8 Oct, 2013 04:14 IST|Sakshi

మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్:
 హత్యకేసులో యావజ్జీవశిక్ష ఖరారైన ఓ ఖైదీ ఎస్కార్టు పోలీసుల కళ్లుగప్పి కోర్టు గోడదూకి పరారయ్యాడు. ఈ టన జిల్లాకేంద్రంలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకెళ్తే.. మహబూబ్‌నగర్ మండలం పాలకొండ సమీపంలో 2012 మే 29న అమిస్తాపూర్ గ్రామానికి చెందిన బాలస్వామి దారుణహత్యకు గురయ్యాడు. ఈ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వడ్డె వెంకటేష్, అదేకేసులో ఉన్న మరో నిందితుడు చౌవుకుల నర్సింహ్మకు కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు బందోబస్తు మధ్య వారిని సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఫ్యామిలీకోర్టుకు తీసుకొచ్చారు. ఇదేఅదనుగా భావించిన వెంకటేష్ కోర్డుగోడను దూకి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ సెట్‌లో జిల్లా పోలీసు యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలో విసృ్దతంగా గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పిల్లలమర్రి వైపు ఓ ఆటోలో వెళ్తున్న నిందితుడిని గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారమిచ్చారు.
 
  సీఐ వెంకటేశ్వర్లు సూచనతో ఎస్‌ఐ అంజాద్‌అలీ, తన సిబ్బందితో కలిసి పిల్లలమర్రిలో దాగిఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. నిందితుడిని డీఎస్పీ కార్యాలయనికి తీసుకొచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడిని పట్టుకున్న పోలీసుల కృషి ఎస్పీ అభినందించారు. ఎస్‌ఐ అంజాద్‌అలీ, పీసీ అమర్‌సింగ్‌లను అభినందించి నగదు పారితోషికం అందజేశారు. ఎస్కార్ట్ సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. పోలీసుల కళ్లుగప్పి పారిపోవడంతో నిందితుడిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరోకేసు నమోదుచేశారు. కాగా, నిందితుడు వెంకటేష్  2012లో షాషాబ్‌గుట్ట ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ యువకుడని అంతమొందించాడు. గతేడాది డిసెంబ ర్‌లో జిల్లా కేంద్రంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎదుట గద్వాలకు చెందిన ఇద్దరిని అతిదారుణంగా కొట్టిచంపాడు. ఈ కేసుల్లో నిందితుడు శిక్షను అనుభవిస్తున్నాడు.
 
 మద్యం మత్తులో ఎస్కార్ట్ సిబ్బంది
 కోర్టు నుంచి తప్పించుకున్న నిందితుడితో పాటు మరో నిందితుడిని ఎస్కార్ట్ పోలీసులు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు మోహన్‌రెడ్డి, మోహన్, పీసీ సురేష్‌లు తీసుకొచ్చారు. వీరిలో ఓ పోలీసు మద్యంమత్తులో ఉన్నట్లు తెలిసింది. ఆయన నిర్లక్ష్యం మూలంగానే ఖైదీ తప్పించుకునేందుకు అవకాశం దొరికినట్లు సమాచారం.
 
 ఏకే 47 నిందితులనుపట్టుకుంటాం
 జిల్లా కోర్టు ఆధీనంలో ఉన్న ఓ కేసుకు సంబంధించి ఆయుధం ఏకే 47 గల్లంతైన సంఘటనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎస్పీ సమాధానమిస్తూ.. ఆయుధాన్ని దొంగిలించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అసలు నింది తులు ఎవరనే విషయాన్ని ఛేదిస్తామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు