వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు

24 Jan, 2020 04:40 IST|Sakshi

గీతదాటి రొచ్చులో పడటంపై రాజ్యాంగ నిపుణుల విస్మయం

రాజకీయ క్రీడలో పావుగా మారిందని ఆవేదన

చంద్రబాబు కోసం మండలి విలువ తాకట్టు

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజకీయ క్రీడలో పెద్దల సభ ప్రతిష్ట మసకబారిందా? గీత దాటి గౌరవాన్ని కోల్పోయిందా? అనే  ప్రశ్నలకు మేధావుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై శాసనమండలి వైఖరి నేపథ్యంలో విన్పిస్తున్న వాదనలివి. ప్రజల ద్వారా ఏర్పడిన అసెంబ్లీ పంపిన బిల్లులకు మండలి సవరణలతో సరిపెడితే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పిన మండలి చైర్మన్, విచక్షణాధికారం వాడుకున్నానని చెప్పడంతో కౌన్సిల్‌ పరువు గంగపాలయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లులను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ఎజెండాకు తామెందుకు సహకరించాలని మండలి సభ్యులే ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినా సర్వాధికారం శాసనసభకే ఉన్నప్పుడు అనవసరంగా శాసనమండలి రాజకీయ వివాదాలకు వేదికవ్వడాన్ని బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలూ వ్యతిరేకిస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపే విధానం సరైంది కాదంటూనే.. విచక్షణాధికారం తప్పలేదని మండలి చైర్మన్‌ చెప్పడం అన్ని వర్గాల్లోనూ చర్చకు ఆస్కారమిచ్చింది. ‘సలహాలు సూచనలు ఇవ్వొచ్చు... లేదంటే తిరస్కరించవచ్చు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలకు పెద్దల సభ వేదిక కాకూడదు’ అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ స్పష్టం చేశారు.

ఎవరి కోసం ఈ వివాదం?
అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి మండలి చైర్మన్‌నే రాజకీయ ఉచ్చులోకి దించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను ప్రభావితం చేయడం ఓ సమస్య అయితే.. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే మండలి లక్ష్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘శాసన మండలి రాజకీయంగా నడుస్తోందన్న సంకేతాలిచ్చినట్లయింది. నిబంధనల ప్రకారం వెళ్లాలని సూచించాం. కానీ ఇక్కడ రూల్స్‌ అతిక్రమించామని చైర్మనే అంటున్నారు.

ఇవి మంచి సంకేతాలా?’ అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ఇష్టపడని ఇంగ్లిష్‌ మీడియం, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లులూ గతంలో సభకొచ్చాయి. వాటికి సవరణలు చేస్తూ పంపారు. పరోక్షంగా వీటిని టీడీపీ తిరస్కరించినా.. ఇబ్బంది లేకుండా అభిప్రాయం చెప్పగలిగారని మరో ఎమ్మెల్సీ అన్నారు. సీఆర్‌డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలోనూ ఇదే చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. రాజకీయంగా పంతం నెగ్గించుకోవడమే అంతిమ ధ్యేయంగా మండలి పరువును టీడీపీ బజారుకీడ్చిందని ఆయన అన్నారు. సభలో బలముందని ఇలా వ్యవహరించడం వల్ల రాజ్యాంగ బద్ధమైన వేదిక విలువ పడిపోతుందని మండలిలో బీజేపీ పక్ష నేత మాధవ్‌ ఆక్షేపించారు.

ఇంత చేసినా బిల్లును ఆపగలరా?
కీలకమైన బిల్లులను రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకోవడంతో ఇప్పుడు శాసనమండలి అందరి నోళ్లలో నానుతోందని, ఇది మంచి పరిణామం కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ‘అసలు మండలి చైర్మన్‌ విచక్షణాధికారంపై చర్చ జరగాల్సిందే’ అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన తీరును ఆయన తప్పుబట్టారు. పెద్దల సభ లోతైన విశ్లేషణతో మంచి సలహాలిచ్చే వేదికన్న భావన ఇప్పటి వరకూ ఉందని, ఇప్పుడు అదో రాజకీయ కుట్రలకు వేదికగా మారిందని మరో రాజకీయ విశ్లేషకుడు అన్నారు. సెలెక్ట్‌ కమిటీకి పంపి చెడ్డపేరు తెచ్చుకోవడం మినహా బిల్లును ఆపగలిగే శక్తి మండలికి ఉంటుందా? అలాంటప్పుడు ఈ యాగీ ఎందుకని మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘జాప్యం చేయవచ్చేమోగానీ.. ఆపలేనప్పుడు అనవసరంగా వివాదం కావడమేనన్న భావన న్యాయ నిపుణుడు మాడభూషి శ్రీధర్‌ మాటల్లో వ్యక్తమైంది. ఏదేమైనా బిల్లులపై మండలి తీరు విస్తృత చర్చనీయాంశమవ్వడం మండలి సభ్యులకు చిన్నతనంగా అన్పిస్తోంది.  

విశ్వసనీయతకు సవాల్‌
ఏ సభ అయినా ప్రజాభిప్రాయానికే విలువివ్వాల్సి ఉంటుంది. కానీ మండలి దారి తప్పడం రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందనే వాదన గట్టిగా విన్పిస్తోంది. వివాదాస్పదమైన బిల్లుల విషయంలో మండలి చైర్మన్‌కు సభ్యులు అవసరమైన సలహాలిచ్చారు. కానీ విపక్ష టీడీపీ ఒత్తిడే ఆయనపై పని చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని, ఇది మండలి విలువను దిగజార్చడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘మండలి చైర్మన్‌ వివాదంలోకి వెళ్లడమేంటి? ఆయన నిర్ణయం రాజకీయ ప్రయోజనం కావడం ఏంటి?’ అని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. సీనియర్‌ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ ఈ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ‘చంద్రబాబు కుట్రలో భాగమై.. మండలి చైర్మన్‌ చరిత్ర హీనుడుగా మిగిలిపోయారు’ అని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని ఇలా దొడ్డిదారిన అడ్డుకోవచ్చా? అని ఆయన ప్రశ్నించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు