ఇది చాలా అనైతికం

9 Sep, 2019 07:14 IST|Sakshi
సీతారామారావు, మంగాయమ్మ దంపతులు

మంగాయమ్మ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన వైద్య వర్గాలు 

అద్భుతం సృష్టించే ముందు అనర్థాలను అంచనా వేయాలి 

74 ఏళ్ల వయసులో కృత్రిమ జననాలు మంచిది కాదు 

స్త్రీ.. బిడ్డలను కనే యంత్రం అని అనుకోవడం తప్పు

క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించిన ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ 

సాక్షి, అమరావతి: కృత్రిమ గర్భధారణ వైద్య రంగంలో అద్భుతం. ఎంతోమంది సంతానలేమితో బాధపడే వారు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌..ఇన్‌ విట్రో ఫెర్టిలిటీ) ద్వారా పిల్లలను కని మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడుకు చెందిన మంగాయమ్మ 74 ఏళ్ల వయస్సులో ఐవీఎఫ్‌ విధానం ద్వారా కవలలకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ వయసులో కృత్రిమ గర్భధారణ చేసి బిడ్డలను పుట్టేలా చేయడంపై ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులు అనైతిక చర్యలకు పాల్పడ్డారని ఆ రంగానికే చెందిన వైద్య నిపుణులు తప్పుబడుతున్నారు. ఇది పూర్తిగా అనైతిక చర్య అని..  ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. సైన్సు పది మందికీ ఉపయోగపడాలి గానీ, సంచలనం కోసం ఎప్పుడూ చేయకూడదని పలువురు వైద్యులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒక మహిళ ఏ వయసులో అయినా పిల్లల్ని కనే యంత్రం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మరికొంతమం తీవ్రంగా స్పందించారు. 

లీగల్‌.. ఎథికల్‌ అంశాలతో ముడిపడినది 
ఇందులో న్యాయపరమైన, నైతికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ రెండింటినీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత, మా కార్యవర్గంలోనూ చర్చించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం.  
– డా. బి.సాంబశివారెడ్డి, భారతీయ వైద్య మండలి ఏపీ అధ్యక్షులు 
 
ఆ వయస్సులో సరికాదు 
సాధారణంగా 18 ఏళ్ల నుంచి మొదలయ్యే పునరుత్పత్తి ప్రక్రియ 45 ఏళ్ల వరకూ బావుంటుంది. ఆ తర్వాత అండం విడుదల క్షీణిస్తుంది. కానీ, 74 ఏళ్ల వయసులో అనేది చాలా కష్టమైన పని. ఈ దశలో పిల్లలను కృత్రిమంగా 
పుట్టించడమనేది మంచిది కాదు. 
– డా. రాజ్యలక్షి్మ, ప్రొఫెసర్‌ ఆఫ్‌ గైనకాలజీ, ఉస్మానియా వైద్య కళాశాల

విదేశాల్లో చట్టాలు కఠినం 
కృత్రిమ గర్భధారణ అంశంలో విదేశాలలో చట్టాలు కఠినంగా ఉంటాయి. బిడ్డలు కావాలనుకునే వారికి కొన్ని అంశాల్లో అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి తెలియజెప్పడం వైద్యుల బాధ్యత. తాజా ఉదంతంతో ఇప్పుడు వయసు బాగా పైబడిన వారు కూడా తాము బిడ్డలకు జన్మనివ్వవచ్చా అని ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ఇది అంత మంచి పరిణామం కాదు.  
– డా. వై.స్వప్న, 
వైద్య నిపుణురాలు, విజయవాడ 

వృద్ధాప్యంలో పిల్లల్ని కనడం సరైంది కాదు... 
ఎలాంటి విధానంలో అయినా సరే యాభై ఏళ్లు దాటిన మహిళ గర్భం నుంచి పిల్లల్ని పుట్టించడమనేది సరైన విధానం కాదనేది వైద్య వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. డెబ్భై ఏళ్ల వయసులో మధుమేహం,           రక్తపోటు, గుండెజబ్బులకు ఆస్కారం ఉంటుందని.. రక్తనాళాలు బలంగా ఉండకపోవడం వంటి కారణాలవల్ల ఆ మహిళకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందంటున్నారు. మన దేశంలో ఐవీఎఫ్, సరోగసీ వంటి విధానాలకు సరైన చట్టం లేకపోవడం.. సంతాన సాఫల్య కేంద్రాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని మరి కొందరు చెబుతున్నారు.  

ముందుముందు ఇలాంటివి ఎవరూ చేయకూడదు 
‘పలు వార్తా పేపర్లు, టీవీ ఛానెళ్ల, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాం. ఇది పూర్తిగా అనైతిక చర్యగా భావిస్తున్నాం. ఏఆర్‌టీ (అసిస్టెడ్‌ రీ ప్రొడక్టివ్‌ టెక్నాలజీ) నిబంధనలను పూర్తిగా దుర్వినియోగ పరిచారని భావిస్తున్నాం. ఇలాంటివి భవిష్యత్‌లో ఎవరూ చేయకూడదని కూడా సూచిస్తున్నాం. దీనివల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి మా సంఘాల తరఫున క్షమాపణలు కోరుతున్నాం’. 
– ఐఎస్‌ఏఆర్‌ (ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రీ ప్రొడక్షన్‌) 
– ఐఎఫ్‌ఎస్‌ (ఇండియన్‌ ఫెర్టిలిటీ సొసైటీ)  
– ఏసీఈ (అకాడెమీ ఆఫ్‌ క్లినికల్‌ ఎంబ్రాలజిస్ట్స్‌)

మరిన్ని వార్తలు