దేవుళ్లకూ కులం ఆపాదనా...!

25 May, 2018 04:32 IST|Sakshi

టీడీపీ నేతల తీరుపై ప్రజల్లో విస్మయం

సామాజిక మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా తెలుగుదేశం నేతల తీరుపై విసిగివేసారిన ప్రజలు తాజాగా ఆపార్టీ  ప్రజాప్రతినిధులు, నేతలు చేస్తున్న వ్యాఖ్యానాలతో అవాక్కవుతున్నారు. అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రజలను కులాలు, మతాలుగా చీలుస్తూ చేస్తున్న ప్రసంగాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వీటిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీమహానాడులో ఆ పార్టీ ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి అంటూ సంబోధించడాన్ని చూసి హవ్వ అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అగ్రనేతలు కులాల వారీగా ప్రస్తావనలు చేస్తూ వివిధ వర్గాల పట్ల తమ మనసులోని వైఖరిని బయట పెట్టుకుంటుండగా చివరకు దేవుళ్లకూ ఈ కులాల గొడవను అంటగట్టడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఎన్ని మతలబులు చేసిందో అందరికీ తెలిసిందేనని, అయినా ఆపార్టీకి మెజార్టీ రాకుండా ఆగడానికి కారణం... మా ‘వెంకన్న చౌదరియే’నని వ్యాఖ్యానించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలురకాల సెటైర్లతో కూడిన వ్యాఖ్యలు, చిత్రాలు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆపార్టీ అధినేత చంద్రబాబు ఇంతకు ముందు ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఏకంగా మీడియా సమావేశంలోనే మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఆ మధ్య ద్వారకా తిరుమలలో స్పీకర్‌ కోడెల చౌదరి కూడా మన కమ్మోళ్లే ఎప్పుడూ అధికారంలో ఉండాలని, అందుకు మనోళ్లంతా కష్టపడాలని చెప్పారంటూ విమర్శలు వచ్చాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ చంద్రబాబు, ఇతర నేతల తీరుపై విమర్శలు సామాజిక మాద్యమాలలో వెల్లువెత్తుతున్నాయి.

మనసులో మాటలూ వచ్చేస్తుంటాయి...
గతకొంతకాలంగా టీడీపీ నేతల ప్రసంగాల్లో వారి మనసులో మాటలు బయటపెడుతున్నారని పలువురు సామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్నారు. ‘అవినీతి, కులప్రీతి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీనే. సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఉరివేసుకున్నటే’ అంటూ గతంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పేర్కొనడాన్ని, భారతదేశాన్ని అవినీతి దేశంగా మార్చేవరకు నిద్రపోనని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను వారు  గుర్తుచేస్తున్నారు.   

మరిన్ని వార్తలు