‘విమర్శ’కు పురస్కారం

20 Dec, 2014 02:11 IST|Sakshi
‘విమర్శ’కు పురస్కారం

సాహిత్య విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  
 బాధ్యతను మరింత పెంచిందన్న అవార్డు గ్రహీత

 
తిరుచానూరు/తిరుపతి తుడా : ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం తన బాధ్యతను మరింత పెంచడమేనని అవార్డు గ్రహీత యోగి వేమన యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఆయనకు అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాచపాళెం మాట్లాడుతూ ఈ అవార్డు సాహితీ విమర్శక ప్రపంచానికి వచ్చినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తాను చేయాల్సిన, తన ముందు ఉన్న కర్తవ్యాన్ని అవార్డు గుర్తు చేస్తోందని చెప్పారు. 42 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య విమర్శపై రచనలు చేసినట్లు తెలిపారు. మొత్తం 19సాహిత్య విమర్శలు రాశానన్నారు.
 
ఇదీ రాచపాళెం ప్రస్థానం..
 
తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామంలో 16-10-1948లో రామిరెడ్డి, రాజమ్మ దంపతులకు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యను కుంట్రపాకం, ఉన్నత విద్యను వెంకటాపురం, తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో అభ్యసించారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చేశారు. 1970-72లో ఎస్వీయూలో ఎంఏ తెలుగు చేశారు. 1976లో ప్రొఫెసర్ కోటేశ్వరరావు పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు. 1977లో అనంతపురం జిల్లాలోని ఎస్వీయూ పీజీ సెంటర్లో లెక్చరర్‌గా పనిచేశారు. తరువాత పీజీ సెంటర్‌ను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీగా మార్చాక అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, రీడర్‌గా, 1993లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. అధ్యాపకుడిగా 35 ఏళ్ల పాటు సేవలందించారు. 2008 అక్టోబర్‌లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది నవంబర్‌లో వైఎస్సార్ జిల్లా కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ప్రత్యేకాహ్వానం మేరకు గెస్ట్ ప్రొఫెసర్‌గా చేరారు.

ప్రస్తుతం యోగి వేమన యూనివర్సిటీ తెలుగు విభాగంలో ప్రొఫెసర్‌గా ఉంటూ సీపీ బ్రౌన్ లైబ్రరీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రాచీన తెలుగు కవుల సిద్ధాంతాలు, చర్చ అనే తెలుగు విమర్శ రచనలకు శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించింది. ఈయన ఇప్పటి వరకు 19 తెలుగు సాహిత్య విమర్శన గ్రంథాలు వెలువరించారు. పలు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించింది. త్వరలోనే ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు.
 

మరిన్ని వార్తలు