ఏ పనికైనా జేబు నిండాల్సిందే..

2 Oct, 2019 10:20 IST|Sakshi
యద్దనపూడి పంచాయతీ కార్యాలయం

ఇష్టారీతిగా పంచాయతీ కార్యదర్శి వ్యవహారం

నాటి అధికార టీడీపీ నాయకుల దన్నుతో అడ్డగోలు వ్యవహారాలు

సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): మండల కేంద్రమైన యద్దనపూడి మండల పంచాయతీ తాజామాజీ కార్యదర్శి కుమారస్వామి గత ప్రభుత్వ కాలంలో అప్పటి అధికారపార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎనిమిది సంవత్సరాల్లో యద్దనపూడి పంచాయతీ కార్యదర్శిగా, రెండు సంవత్సరాలుగా ఈఓఆర్డీగా విధులు నిర్వహించిన కుమారస్వామి గత జూలై 23న ఇక్కడ నుంచి బదిలీపై పుల్లల చెరువు మండలం వెళ్లి లాబీయింగ్‌ ద్వారా ప్రస్తుతం బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి ఇక్కడ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సమయంలో నాటి అధికార పార్టీ నేతల దెబ్బకు సదరు అధికారిపై నోరుమెదపలేని వారు ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేయటం గమనార్హం.

ఇదిగోండి జాబితా..
యద్దనపూడి గ్రామానికి చెందిన రావిపాటి లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలికి గత సంవత్సరం జూన్‌ నెలలో వృద్ధాప్య పింఛన్‌ మంజూరు కాగా ఆ మహిళకు పెన్షన్‌ ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన రావిపాటి కాంతయ్య అనే పురుషునికి గత నెల ఆగస్టు వరకు అంటే 14 నెలల పాటు పెన్షన్‌ ఇచ్చారు. ఇది స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సదరు మహిళ ఎంపీడీఓ కార్యాయలంలో, సీఎం పేషీలో ఫిర్యాదు చేయటంతో శుక్రవారం యద్దనపూడి వచ్చిన కుమారస్వామి స్థానిక నేతల ద్వారా ఆ మహిళతో రాజీయత్నం చేయటం గమనార్హం. 
అలాగే మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన కేతినేని అంజమ్మ అనే మహిళ యద్దనపూడి గ్రామ పరిధిలో 2016లో అంజలి ఇండస్ట్రీస్‌ పేరుతో ఫ్యాక్టరీ స్థాపించేందుకు అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. లక్ష రూపాయలు ఇస్తేనే అప్రూవల్‌ ఇస్తానని చెప్పటంతో చేసేదేమి లేక రూ.30 వేల నగదును ఇచ్చింది. మరోసారి రూ.70 వేలను అంజలి ఇండస్ట్రీస్‌ బ్యాంకు ఖాతా నెంబరు 916020070482078 నుంచి కుమారస్వామికి చెందిన స్టేట్‌ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఆ తర్వాతే అప్రూవల్‌ మంజూరు చేసినట్లు బాధితులరాలు వాపోయింది. 
యద్దనపూడి గ్రామంలో హౌస్‌ అప్రూవల్‌ కోసం నల్లపునేని అనీల్‌ వద్ద రూ.60 వేలు, ఎన్‌. సీతమ్మ అనే మహిళ రూ.20 వేలు, టి.బాబు వద్ద రూ.22 వేలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 
100 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు గతంలో రూ.1500 పెన్షన్‌ ఇవ్వాల్సి ఉండగా చాలామందికి రూ.1000 మాత్రమే ఇచ్చినట్లు బాధితుల ఆరోపణ. అలాగే పంచాయతీ నీటికుళాయి కనెక్షన్‌కు పరిమితికి మించి వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీపై వెళ్లినా పూర్తిస్థాయిలో రికార్డులు కూడా సదరు పంచాయతీలకు అందజేయలేదని గ్రామస్తులు చెప్పటం గమనార్హం.  
మరణధ్రువీకరణ పత్రాల మంజూరులో రూ.3 వేల నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో పర్చూరు మండలం చెరుకూరులో, చీమకుర్తిలో అవినీతి ఆరోపణలపై రెండుసార్లు సస్పెండ్‌ అయినప్పటికీ కుమారస్వామి తన ప్రవర్తన మార్చుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవన్నీ ఆరోపణలే..
కొందరు కావాలనే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. లక్ష్మీకాంతం పింఛన్‌ విషయంలో పొరపాటు పడిన మాట వాస్తవమే.
- పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి

మరిన్ని వార్తలు