డెల్టా..ఉల్టా

5 May, 2019 12:31 IST|Sakshi
ఆధునికీకరణకు నోచుకోని భీమవరం ప్రాంతంలో జీ అండ్‌ వీ పంట కాలువ

భీమవరం (ప్రకాశం చౌక్‌): పశ్చిమ డెల్టా కాలువలు అధ్వానంగా మారాయి.. ఏళ్ల తరబడి ఆధునికీకరణకు నోచుకోక రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. వేసవిలో కాలువలను ఆధునికీకరిస్తాం అని పాలకులు చెబుతున్నా.. ఏటా అంతంతమాత్రంగానే పనులు జరగడం పరిపాటిగా మారిపోయింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో డెల్టా ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో పనులు కూడా చకచకా జరిగా యి. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆధునికీకరణపై దృష్టి సారించకపోవడంతో నిధులు మురిగిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల పాలనలోనూ ఆధునికీకరణ పనులు నామమాత్రంగానే జరిగాయి.

అధ్వానంగా పంట కాలువలు
పశ్చిమ డెల్టా పరిధిలో 11 ప్రధాన కాలువలు, వాటి బ్రాంచ్‌ కెనాల్స్‌ కింద 5,29,962 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో నికర ఆయకట్టు 4,60,000 ఎకరాలు కాగా చేపల చెరువులు 69,962 ఎకరాలు ఉన్నాయి. పదేళ్లుగా దాదాపు అన్ని కాలువలు పూడుకుపోవడం, కర్రనాచుతో నిండిపోవడం, గట్లు బలహీనంగా మారడంతో ముంపు సమయంలో గండ్లు పడే పరిస్థితి ఉంది. కొన్ని కాలువలు చెత్తాచెదారాలతో మురుగు కాలువలను తలపించేలా మారిపోయాయి. ఆయా కారణాలతో పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. నీరు ఉధృతంగా వచ్చినప్పుడు కొన్నిచోట్ల కర్రనాచు వల్ల నీరు ముందుకు పారక గట్లు తెగుతున్నాయి. అటువంటి సమయాల్లో పొలా ల్లోకి ముంపు నీరు చేరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితమెప్పుడో కాలువ పూడికతీత పనులు జరిగాయి. ఆ ఆతర్వాత ఎన్నడూ పూరిస్థాయిలో పనులు జరిగిన దాఖలాలు లేవు.

పనులు నామమాత్రం
డెల్టా కాలువల ఆధునికీకరణ పనులకు నిధులున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అంతంతమాత్రంగానే జరిగాయి. అధునికీకరణ పేరు చెప్పి ఒక వియ్యర్‌ నిర్మాణం చేపట్టడం, ఒకటి, రెండు గట్లను పటిష్టం చేయడంతో సరిపెడుతున్నారు. జారిపోతున్న గట్లకు రివిట్‌మెంట్‌ నిర్మాణ పనులు చేయడం లేదు.

ఈ ఏడాది రూ.30 కోట్ల వరకు.. 
ఈఏడాది వేసవిలో కాలువల ఆధునికీకరణకు సుమారు రూ.30 కోట్ల వరకు నిధులు మంజూరైనట్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సక్రమంగా బిల్లులు రాకపోవడంతో ఇరిగేషన్‌ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు మక్కువ చూ పడం లేదు. దీంతో టెండర్లకు స్పందన కరువయ్యింది.

ఈ ఏడాదీ అనుమానమే..!
జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు అవకాశం లేదు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలుస్తారా? లేక అధికారులు నేరుగా టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈక్రమంలో వేసవి ఆధునికీకరణ పనులపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఆధునికీకరణ పనులు జరగకపోతే సాగునీటి ఇక్కట్లు తప్పవని, కాలువ గట్లు తెగిపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు.}

డ్రెయినేజీ శాఖలోనూ ఇదే తంతు
పశ్చిమ డెల్టా పరిధిలో మురుగు నీటి డ్రెయిన్లూ అధ్వానంగానే ఉన్నాయి. పూడుకుపోయి, తూడు, చెత్తాచెదారంతో నిండి ఉన్నాయి. దీంతో ముంపు సమయాల్లో పొలాల్లో నీరు బయటకు పారడం లేదు. డ్రెయినేజీ గట్లు బలహీనంగా ఉండటంతో పాటు చాలాచోట్ల ఆక్రమణలో ఉన్నాయి. డ్రెయినేజీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లుల పెండింగ్‌ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతేడాది డ్రెయిన్ల అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.50 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే రూ.20 కోట్ల పనులకు టెండర్లు దాఖలు కాలేదు. ఈ ఏడాది సుమారు రూ.10 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత అధికారులు మరోమారు టెండర్లు పిలవనున్నారు.  

పూడిక తీత పనులు చేపట్టాలి
మా గ్రామం ఆయకట్టు జీ అండ్‌ వీ పంట కాలువ నీటిపై ఆధారపడి ఉంది. అయితే పంట కాలువలో కర్రనాచు తీవ్రంగా ఉండటం వల్ల సాగునీరు కిందకు పారడం లేదు. దీంతో నీరు గట్లు దాటి పైకి రావడంతో గండ్లు పడుతున్నాయి. మట్టి, కంకర బస్తాలతో అడ్డుకట్ట వేసుకుంటున్నాం. కాలువ పూడిక తీసి సుమారు 10 ఏళ్లు కావడంతో పూడుకుపోయింది. ఈ వేసవిలో అయినా కాలువ పూడికతీత పనులు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – పోలుకొండ మోహన్‌రావు, రైతు, కొండేపూడి 

స్పందన అంతంతమాత్రం
కాలువల ఆధునికీకరణ కోసం ఎన్నికల కోడ్‌కు ముందు కొబ్బరికాయ కొట్టిన పనులు జరుగుతున్నాయి. నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో కాలువలకు సంబంధించి పనులు చేస్తున్నాం. పశ్చిమ డెల్టా ఆధునికీకరణ పనులకు సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన తక్కువగా ఉంది. ఎన్నికల కోడ్‌  ముగిసిన తర్వాత మళ్లీ టెండర్లు పిలుస్తాం. అత్యవసరమైన పనులను చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ఎం.దక్షిణామూర్తి, ఇరిగేషన్‌ శాఖ ఈఈ, శెట్టిపేట, నిడదవోలు మండలం

ఎవరూ ముందుకు రాలేదు 
ఈ ఏడాది డ్రెయినేజీ అభివృద్ధి పనుల నిమిత్తం సుమారు రూ.10 కోట్లకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరు ముందు రాలేదు. మళ్లీ టెండర్లు పిలవడానికి ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపడతాం. కాంట్రాక్టర్లు ముందుకువస్తే వారికి పనులు అప్పగించి డ్రెయిన్లు అభివృద్ధి చేస్తాం. కాంట్రాక్టర్లు ముందుకురాకపోతే ఉన్నతాధికారుల అదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – పి.నాగార్జునరావు, డ్రెయినేజీ శాఖ ఈఈ, భీమవరం   

మరిన్ని వార్తలు