రుణాలు రీషెడ్యూలే

17 Jul, 2014 02:16 IST|Sakshi
రుణాలు రీషెడ్యూలే

 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
  ఇంటిలో ఒక్కరికే.. ఒక్క రుణానికే వర్తింపు
 బంగారంపై తీసుకున్న రుణాల మాఫీ నావల్ల కాదు
 ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మారుస్తాం

 
 సాక్షి, ఏలూరు: వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతానికి రీషెడ్యూల్ మాత్రమే చేస్తామని, రుణమాఫీ గురించి తర్వాతే ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తాడిచర్ల, ఉప్పలపాడు, రావికంపాడు గ్రామాల్లో ఆయన బహిరంగ సభల్లో మాట్లాడారు. కామవరపుకోటలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘రుణమాఫీపై చాలా సాంకేతిక ఇబ్బందులున్నాయి. ఆర్‌బీఐ మేం ఇవ్వలేం అంటోంది. ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాల వాళ్లూ ఇలానే అడుగుతారంటోంది. అయినా సరే నేను మాఫీ చేసేందుకు యత్నిస్తా. ముందుగా నాలుగైదు రోజుల్లో రీ షెడ్యూల్ చేయిస్తాం. 2014 ఏప్రిల్ ఒకటో తేదీలోపు రుణాలు తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఒక్కరికే, ఒక్క రుణానికే వర్తిస్తుంది. రీషెడ్యూల్ చేసుకున్నవారికి 12 శాతం వడ్డీ పడుతుంది. ఆ భారం రైతులపై వేయకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం’’ అని చంద్రబాబు చెప్పారు. రుణాల రీషెడ్యూల్ విషయమై తాను ఈరోజే ఆర్‌బీఐ గవర్నర్‌తో ఫోన్‌లో మాట్లాడానని తెలిపారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాల మాఫీ మాత్రం తనవల్ల కాదని స్పష్టం చేశారు. ‘బంగారంపై తీసుకున్న రుణాలు చాలానే ఉన్నాయి. వ్యవసాయం పేరిట రుణం తీసుకుని వేరే వాటికి వినియోగించుకున్నారు. అటువంటి వాటి గురించి నేనేం చేయలేను’ అని చంద్రబాబు చేతులెత్తేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
 పరిస్థితి అర్థం చేసుకోండి
 
 - సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అనంతపురంలో నేను రుణమాఫీ ప్రకటన చేశాను. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అందుకే వ్యవసాయ రుణమాఫీ గురించి మరికొంత సమయం అడుగుతున్నాను. ఏదేమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తా. రైతులు అర్థం చేసుకోవాలి.
 - ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ కట్టాలో ఇంకా తెలియడం లేదు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. ఎర్రచందనాన్ని ఆదాయ వనరుగా మారుస్తాం. నల్లమల అడవుల్లో ఇప్పటికే 15వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పట్టుబడింది. వీటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయిస్తాం.
 - ప్రస్తుతం వినియోగంలో ఉన్న పంపుసెట్లు నాణ్యమైనవి కావు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. రైతులు కొత్త పంపుసెట్లు ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం విద్యుత్ శాఖ నుంచి రుణాలు ఇప్పిస్తాం.
 - జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తాం. కేంద్రం సహకారంతో బహుళార్థసాధక ప్రాజెక్టు అరుున పోలవరంను నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.
 - రాష్ర్టంలో ప్రముఖ దేవాయాల్లో ప్రజలిచ్చిన కానుకలు వారికే ఉపయోగపడేలా దేవాలయాల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు నెలకొల్పాలని యోచిస్తున్నాం. ముఖ్య దేవాలయాల్లో రోజుకు 5వేల మందికి ఉచిత నిత్యాన్నదానం చేసేలా చర్యలు చేపట్టాం. అవసరమైతే గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత భోజనం పెట్టే దిశగా ముందుకెళ్తాం.
 

>
మరిన్ని వార్తలు