ప్రకటన సరే..చర్యలేవీ?

16 Apr, 2019 13:41 IST|Sakshi
టి. సుండుపల్లెలో ఎండిపోయిన వేరుశనగ పంట(ఫైల్‌)

జిల్లాలో 51 మండలాల్లో కరువు

రైతులకు అందని నష్ట పరిహారం

ఇన్‌పుట్‌ సబ్సిడీకి నివేదికలు పంపినా పట్టించుకోని ప్రభుత్వం

నేడు జిల్లాకు వ్యవసాయశాఖ కమిషనర్‌

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలు తీవ్ర వర్షాభావంతో ఎండిపోయి పెట్టుబడి కూడా తీరక రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఖరీఫ్‌లో కరువు పీడిత జిల్లాగా ప్రకటిస్తూ 51 మండలాల్లో కరువు నెలకొన్నట్లు తెలిపారు. అయితే జిల్లా యంత్రాంగం 22 మండలాల్లోనే కరువు ఉన్నట్లు తేల్చారు. రబీలో 51 మండలాలకు 43 మండలాలలో కరువు నెలకొన్నట్లు లెక్కలు కట్టారు.ప్రకటన కొంత మేరకు ఉపశమనం కలిగిస్తున్నా ప్రభుత్వ తీరు పరిశీలిస్తే రైతులకు నిరాశ కలుగుతోంది. ప్రకటన వెలువరించాక సాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కలుగకపోవడాన్ని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది ఇలా ఉండగా 2015నవంబరు, 2015 మే, 2016 డిసెంబరు నెలల్లో అకాల వర్షాల వల్ల పంటలు పోయాయి.

దీనికి సంబంధించి రూ.60.55 ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట పెట్టుబడి రాయితీ) ఇంత వరకు ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని రైతులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయానికి ప్రతి రోజు ఏదో ఒక మండలం నుంచి రైతులు అధికారుల వద్దకు రావడం ప్రభుత్వం నుంచి రాగానే మీ ఖాతాలకు పడుతుంది పొండి అని చెప్పగానే ఇంటికి దారి పట్టడం షరామూలుగా మారింది. కానీ ఏళ్లు గడుస్తున్నా రైతు ఖాతాలకు సొమ్ములు చేరిందిలేదు. సాధారణంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కరువు మండలాల్లో రైతులు నష్టపోయిన పంటలకు పరిహారాన్ని చెల్లించడం, ఇతరత్రా సాయం ప్రకటించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం రైతులు వీటిని అడగకుండా ఉంటే చాలని అనుకుంటోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా సొమ్ములు రైతులకు చెల్లించాలని జిల్లాకు మంగళవారం వస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ కమీషనర్‌ మురళీధరరెడ్డికి రైతు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

రూ.115.58 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఎప్పుడిస్తారో
గత ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో 51 మండలాల్లో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 393 మిల్లీ మీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 202 మిల్లీమీటర్లు కురిసింది. ఈ సీజన్‌లో 1,33,556 హెక్టార్ల సాధారణ పంటల సాగు కావాల్సి ఉండగా కేవలం 47,171 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వానలు లేకపోవడంతో పంటలు ఎండిపోయాయి. వివరాలను సేకరించి పంపితే పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో 22 మండలాల్లో పంటలకు నష్టం జరిగిందని నివేదికలు తయారు చేసి కలెక్టర్‌ హరికిరణ్‌ ద్వారా ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయశాఖ గత ఏడాది నవంబరు నెల 21న పంపింది. రూ.15.58 కోట్ల పెట్టుబడి రాయితీ రైతులు నష్టపోయారని నివేదికల్లో పేర్కొన్నారు. వెంటనే నివేదికలు పంపితే పరిహారం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవడాన్ని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌తోపాటు 2015 నవంబరు నెలలో అకాల వర్షాల కారణంగా రూ.44 కోట్లు, 2015 మే నెలలో రూ.30 లక్షలు, 2016 డిసెంబర్‌లో 1.27 లక్షలు నష్టం సంభవించింది. మొన్న రబీలో 1,37,154 హెక్టార్లలో ప్రధాన పంటలైన బుడ్డశనగ, వేరుశనగ, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, దనియాలు దెబ్బతిన్నాయి. అయితే పంట దిగుబడులను (క్రాప్‌ కటింగ్‌) జిల్లా వ్యవసాయ గణాంక అధికారులు, ఫసల్‌ బీమా కంపెనీ ప్రతినిధులు లెక్కకడుతున్నారు. కానీ పంటకోత ప్రయోగంలో దిగుబడులు ఏ మాత్రం రాలేదని స్పష్టమవుతోంది. పంట సాగు కోసం చేసిన పెట్టుబడులు రూ.100 కోట్లు నేలపాలయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో నష్టం సంభవించినా ఇంతవరకు పరిహారం ప్రభుత్వం మంజూరు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.

గతంలో ఎప్పుడూ ఇలా లేదు
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో బీమా నష్టం జరిగిందని జిల్లా నుంచి కాగితాలు పోగానే వెంటనే పరిహారం వచ్చేది. రుణమాఫీ కూడా ఒకేసారి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. నేను ఏటా ఐదు ఎకరాల్లో రబీలో బుడ్డశగన, ప్రొద్దుతిరుగుడు పంటలను సాగు చేస్తున్నాను. 2012 నుంచి ఇప్పటి వరకు బీమా పూర్తి స్థాయి అందుకోలేదు.     –సుధాకర్‌రెడ్డి, రైతు కొత్తపల్లె, పెండ్లిమర్రి మండలం.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి
ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు. బ్యాంకుల్లో అప్పులు చెల్లించలేక తంటాలు పడుతున్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ నాలుగైదు సంవత్సరాలుగా రాలేదు. అయినా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.–సంబటూరు ప్రసాదరెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ

ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం
జిల్లాలో 2012 నుంచి 2018 వరకు పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతులకు సక్రమంగా చెల్లించలేదని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం.   పట్టించుకోలేదు. జిల్లాలోని రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించి ఏళ్ల తరబడి ఎదురు చూడాలా?  ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.–చంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం.

మరిన్ని వార్తలు