ఇజ్రాయిల్‌ సాగు బహు బాగు

19 May, 2018 12:32 IST|Sakshi
అక్కడి బిందు సేద్యం ,ఇజ్రాయిల్‌లో వ్యవసాయ పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

ప్రపంచ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన వ్యవసాయ అధికారి అభిప్రాయం

సేద్యం పద్ధతులపై నిశిత పరిశీలన

మన రైతులకు ఆదర్శమని ప్రశంస

పరిమితంగా లభించే జలవనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని సేద్యంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న దేశంగా ఇజ్రాయిల్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. గరిష్ట భూభాగం ఎడారిగా ఉన్నా అక్కడ సాధిస్తున్న దిగుబడులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. ఈ ప్రత్యేకతలను అధ్యయనం చేయడానికి మన రాష్ట్రానికి చెందిన వ్యవసాయాధికారులు అక్కడికి వెళ్లారు. విశాఖ జిల్లాకు చెందిన వారు కూడా ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌లో ఈనెల ఈ నెల 8 నుండి 10 వరకు జరిగిన 20వ ప్రపంచ వ్యవసాయ సదస్సు, వ్యవసాయ పనిముట్ల ప్రదర్శనలో పాల్గొన్నారు. జిల్లాకు తిరిగివచ్చిన సందర్భంగా అక్కడి సేద్యం తీరుతెన్నుల గురించి వ్యవసాయ అధికారి పి.సత్యనారాయణ విలేకరులకు వివరించారు.

పరవాడ(విశాఖ పశ్చిమం): ఇజ్రాయిల్‌ దేశంలో అమలు జరుగుతున్న వ్యవసాయ సాగు పద్ధతులు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని మండల వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ చెప్పారు. ఇజ్రాయిల్‌లో అమలు జరుగుతున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు అద్భుతమని ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు. ‘ఇజ్రాయిల్‌లో బిందు, తుంపర్ల సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో అక్కడి రైతులు అధిక దిగుబడులు సాదిస్తున్నారు. అక్కడ అమలు జరుగుతున్న సూక్ష్మ నీటి వ్యవసాయ విధానాలు, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు గొప్పగా ఉన్నాయి. పరికరాల పనితీరును మేం నిశితంగా పరిశీలించాం. అక్కడి పరిస్థితులను చూసినప్పుడు గొప్పగా అనిపించింది.’ అని చెప్పారు.

ఇజ్రాయిల్‌లో పెట్రోల్, డీజిల్‌ వినియోగం అధికంగా ఉన్నప్పటికీ వాటిని పొదుపుగా వాడతారని తెలిపారు. సముద్రపు నీటిని సాగు, తాగునీటిగా మార్చుకొని వినియోగించుకొనే పద్ధతులను అక్కడి ప్రజలు బాగా అలవర్చుకున్నారని తెలిపారు. అననుకూల వాతావరణం, తక్కువ వర్షపాతం, తక్కువ మానవ వనరుల లభ్యత ఉన్నప్పటికీ ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులతో పాటు బిందు సేద్యం సాగుతో అధిక దిగుబడులు సాధిస్తున్నారని చెప్పారు. ఇజ్రాయిల్‌ దేశంలో ప్రధానంగా గోధుమ, పండ్లు, కూరగాయలు, ద్రాక్ష, ఆలివ్‌ పంటలను అధికంగా సాగు చేస్తారని చెప్పారు. మన రైతులు అక్కడి సాగు పద్ధతుల నుండి చాలా నేర్చుకోవాలని చెప్పారు. దేశంలో ఆహార ధాన్యాలను సమృద్ధిగా  పండించడానికి మరిన్ని పరిశోధనలు జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యవసాయ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంటు డైరెక్టర్‌ బి.విజయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు