సోకిందా... గోవిందా!

9 Sep, 2014 03:02 IST|Sakshi
సోకిందా... గోవిందా!

దొండసాగు లాభాలు తెచ్చిపెడుతోంది. దీంతో రావులపాలెం పరిసర ప్రాంతాల్లో రైతులు ఈ సాగును సుమారు 600 ఎకరాల్లో చేపట్టారు. అయితే విరామం లేకుండా ఈ సాగు చేయడంతో వైరస్ వ్యాపించి పంట మొత్తం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. రూ. లక్షలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు ఈ పంటను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయానికి వైరస్ సోకి, కాయల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని లోలోపల కుమిలిపోతున్నారు.

అయితే మార్కెట్లో ధర బాగుందని... విరామం లేకుండా దొండసాగు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యానశాఖాధికారులు చెబుతున్నారు. ఒక సారి పంట వేసిన తర్వాత పదేపదే అదే పంటను వేస్తే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనికి పంట మార్పిడియే సరైన మందని సూచిస్తున్నారు. దొండసాగులో యాజమాన్యపద్ధతులు, వైరస్ బారిన పడకుండా పంటను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలను వివరిస్తున్నారు కొత్తపేట ఉద్యానవనశాఖాధికారిణి ఎం.బబిత(83329 90547). ఆ సూచనలు ఆమె మాటల్లోనే...                  
- రావులపాలెం
 
దొండసాగును పీడిస్తున్న వైరస్
ఒక్కసారి సోకితే చాలు ఆపడం కష్టమే
దిగుబడిపై తీవ్ర ప్రభావం
పంట మార్పిడే సరైన మందు అంటున్న ఉద్యానశాఖాధికారులు
ఏళ్ల తరబడి ఒకే పొలంలో దొండ సాగు చేస్తే సాగు మొదటిలో వ్యాపించిన వైరస్, ఇతర శిలీంధ్రాలు, ధాతువులు అదే నేలలో ఉండిపోయి బలం పుంజుకుంటాయి. దీంతో అవి తదుపరి పంటపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ వైరస్ తాలూకూ అవశేషాలు నశించడానికి మందులు పెద్దగా పని చేయవు. అందుకే పంటమార్పిడి చేయాలి. దీని వల్ల సాగు సమయంలో దొండపై ప్రభావం చూపే వైరస్, ఇతర శిలీంధ్ర అవశేషాలకు పోషణ అందవు.
 
దొండ సాగుపై ఎరువుల యాజమాన్య పద్ధతులు

కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏడాది పొడవునా దొండసాగు చేపట్టవచ్చు. దొండ విత్తనం చూపుడు వేలు లావు ఉన్న కొమ్మలు నాలుగు కనుపులు ఉన్నవి రెండు చొప్పున ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల లోతులో నాటాలి. నాటే సమయంలో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరమ్ ఒకసారి అరగంట విరామం అనంతరం ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ఒకసారి కలిపి శుద్ధి చేయాలి.

విత్తే ముందు ఎకరాకు ఆరు - ఎనిమిది టన్నుల పశువుల ఎరువు, 32 - 40 కిలోల భాస్వరం, 16 - 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటలలో వేయాలి. నత్రజని 32- 40 కిలోలు రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి, పూత పిందె దశలో ఒకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువును వేసిన వెంటనే నీరు పెట్టాలి. కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 మీ.లీ 200
 
లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేయాలి. మొక్కలు రెండు - నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపువ్వులు ఎక్కువగా పూచి పంట దిగుబడి బాగా ఉంటుంది.
 
దొండకు వచ్చే తెగుళ్లు, సస్యరక్షణ చర్యలు
వైరస్ నివారణకు కచ్చితంగా పంట మార్పిడి చే యాలి. పండు ఈగ(ఫ్రూట్‌ఫ్లై) సమస్యకు మిథైక్‌యూజనాల్, వెనిగర్, పంచదారద్రవం పది మిల్లీలీటర్లు చొప్పున కలిపి ఎకరానికి పది ఎరలు పెట్టాలి.
కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి దుక్కిలో వేసుకోవడం వల్ల తెగులు రాకుండా ముందుగా నివారించవచ్చు.
బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ ఒక మిల్లీలీటరు, ఒక లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నులుపురుగులు ఉన్న చోట కార్భోసల్ఫాన్ మూడు గ్రాము కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ఆకుల ఈనెల మధ్య చారలు ఏర్పడి, పెలుసుగా మారి గిడసబారిపోయి పూత, పిందె ఆగిపోతే అది వెర్రి తెగులుగా గుర్తించాలి.
ఈ తెగులు సోకిన మొక్కలను నాశనం చేయాలి. ఈ తెగులు వ్యాపిస్తే బరక పురుగులను నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథాయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేయాలి.
  వేరు కుళ్లు తెగులు ఉన్నట్టయితే తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా పండిపోయి ఆకులు వాడిపోతాయి. దీని నివారణకు బొర్డోమిశ్రమం ఒక శాతం లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు లీటరు నీటికి మూడు గ్రాముల కలిపి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. దీనిని పది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు చేయాలి.
  ఆఖరి దుక్కిలో వేపపండి 250 కిలోలు ఎకరాకు వేసి కలియదున్నాలి. పంట వేసిన తరువాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను భూమిలో పాదుల దగ్గర వేయాలి.
  ‘తీగ’ పంటలపై గంధకం సంబంధిత పురుగు, తెగులు మందులు వాడకూడదు.

మరిన్ని వార్తలు