ఉత్సాహంగా క్రాస్‌కంట్రీ పరుగు పోటీలు

8 Sep, 2013 02:13 IST|Sakshi

గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రాస్‌కంట్రీ పరుగు పోటీల్లో ఇబ్రహీంపట్నం, నందిగామ విద్యార్థులు ప్రతిభ చాటారు. పురుషుల విభాగంలో ఇబ్రహీంపట్నం డాక్టర్ జాకీర్‌హుస్సేన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మహిళల విభాగంలో నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు మొదటిస్థానం సాధించారు. శనివారం స్థానిక ఏఎన్నార్ కళాశాలలో ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో 12 కిలోమీటర్లు, మహిళల విభాగంలో 6 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు.

యూనివర్సిటీ పరిధిలోని మొత్తం 13 కళాశాలలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో మొవ్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండో, గుడివాడ ఏఎన్నార్ కళాశాల మూడో, నందిగామ కేవీఆర్ కళాశాల విద్యార్థులు నాలుగో స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో గుడివాడ ఏఎన్నార్ కళాశాల రెండో, విజయవాడ ఎస్‌జీఎంఎస్ కళాశాల మూడో, మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులు నాలుగో స్థానం సాధించారు.

 పురుషుల పోటీలను స్థానిక ఏలూరు రోడ్డులోని వీకేఆర్ అండ్ వీఎన్‌బీ పాలిటెక్నిక్ వద్ద ఏఎన్నార్ కళాశాల కోశాధికారి కె.ఎస్.అప్పారావు, మహిళల పోటీలను పెదపారుపూడి మండలం దోసపాడులో సర్పంచ్ సజ్జా శివకుమార్ ప్రారంభించారు. ఈ పోటీల్లో ఒక్కొక్క కళాశాల నుంచి ఆరు నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు ఆర్డీవో వెంకటసుబ్బయ్య బహుమతులు అందజేశారు.

 క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణిస్తారు..

 క్రీడలపై ఆసక్తి ఉంటే అన్ని రంగాల్లో రాణించగలుగుతారని ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య అన్నారు. పరుగు పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రతి విద్యార్థీ తనకు తోచిన క్రీడపై ఆసక్తి పెంచుకుని అందులో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నించాలని సూచించారు. కృష్ణా యూనివర్సిటీ ఈ విధమైన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. కృష్ణా యూనివర్సిటీ పరిశీలకుడు ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరానికి గాను క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహానికి రూ.33 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపారుపూడి కళాశాల కార్యదర్శి పర్వతనేని నాగేశ్వరరావు, కోశాధికారి కేఎస్ అప్పారావు, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.శంకర్, పీజీ డెరైక్టర్ నరసింహారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు వై.ఉదయభాస్కర్, టి.శ్రీనివాసరావు, లైబ్రేరియన్ పద్మజ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు