అధికార పార్టీ అడ్డదారి!

7 Mar, 2019 16:12 IST|Sakshi
తమ ప్రమేయం లేకుండానే ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారని తహసీల్దార్‌ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, ప్రజలు (ఫైల్‌)

ఓట్ల తొలగింపునకు కుట్ర

రెండు మీ సేవా కేంద్రాల ప్రమేయం?  

ఓటరుకు...దరఖాస్తుదారునికి తెలయకుండానే కుతంత్రాలు  

సాక్షి, ఆదోని రూరల్‌: ఆడలేక మద్దెల ఓడమన్నట్టు.. ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశాలు పూర్తిగా దూరమవడంతో  కుట్రలు, కుతంత్రాలకు తెలుగు తమ్ముళ్లు  తెరలేపారు. ఏదోవిధంగా మళ్లీ అధికారాన్ని చేపట్టాలనే దురుద్దేశంతో ఓటర్ల తొలగింపునకు పూనుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగింపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకు ఫారం – 7 ద్వారా ఆన్‌లైన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులే దరఖాస్తు  చేసినట్లు కుతంత్రాలు చేశారు. ఆదోని పట్టణంలోని రెండు మీసేవా కేంద్రాలు అడ్డాగా   టీడీపీ నాయకులు కుట్రలు పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదోని నియోజకర్గంలో   ఇప్పటి వరకు ఫారం–7 దరఖాస్తులు 8,500 దాఖలు అయినట్లు సమాచారం. పట్టణ పరిధిలోని  21వ వార్డులో 229 నుంచి 235 వరకు 7 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి దాదాపు 400 ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది.  ఈ వార్డులో మొత్తం ఓటర్లు 6892మంది ఉన్నారు.  

ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కౌన్సిలర్‌ భీమా వెంకటలక్ష్మీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు  కుట్రపన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇదయ్‌తుల్లా, చిన్న స్వామి గౌడ్, భీమా, నర్సప్ప, బైచిగేరి రాముడు, చంద్రశేఖర్‌రెడ్డి పేర్ల మీద ఓట్లు  తొలగించాలని ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేశారు.  దీంతో వారు ఏ మాత్రం తమ ప్రమేయమే లేదని, ఎవరు దరఖాస్తు చేశారో తేల్చాని  తహసీల్దార్‌ విశ్వనాథ్‌ను కలిసి విన్నవించిన  విషయం తెలిసిందే.

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు 
ఫారం–7 దరఖాస్తులు వెల్లువెత్తడంతో అధికారులు సైతం అయోమయానికి గురయ్యారు. అదేవిధంగా తమ ప్రమేయం ఏ మాత్రం లేకుండా తాము దరఖాస్తు చేయడమేమిటని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు తహసీల్దార్‌ విశ్వనాథ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అప్పటికే అనుమానాలు రావడంతో తహసీల్దార్‌  ఈ నెల 3న(ఆదివారం) టూటౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  ఐపీసీ 182, 419 అండ్‌ 66డి ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  త్వరలోనే పోలీసులు వాస్తవాలేంటో ప్రజల ముందు ఉంచే అవకాశం ఉన్నందున టీడీపీ నాయకులు ఎదురు దాడిని తీవ్రం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కఠిన చర్యలు తీసుకోవాలి 
దేశ పౌరుడిగా చెప్పుకోవాలంటే ఓటు హక్కు ఎంతో విలువైంది. నాకు పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 229లో ఓటు హక్కు ఉంది.  ఓటు హక్కును తొలగించేందుకు  సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.   ఇలాంటి సంఘటనలపై అధికారులు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టాలి.

–నాగరాజు, ఎస్కేడీ కాలనీ 7వ రోడ్డు  
 

ఇది టీడీపీ నాయకుల కుట్రే 
మా పోలింగ్‌ స్టేషన్‌ 232లో  నాపేరు, నా ఫొటోతో 23మంది ఓట్లను తొలగించాలని ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసినట్లు తెలిసింది. మా వార్డులో టీడీపీకి మెజారిటీ లేకపోవడంతో కుట్రలు పన్నుతున్నారు. ఏదోవిధంగా వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.   

–చిన్న స్వామి గౌడ్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు 

మరిన్ని వార్తలు