మూడు బంగారు కిరీటాలు మాయం

2 Feb, 2019 23:31 IST|Sakshi

1.300 కిలోల బరువు ఉంటాయన్న అధికారులు

విచారణ ప్రారంభించిన టీటీడీ, పోలీసు అధికారులు

సాక్షి, తిరుపతి : తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు బంగారు కిరీటాలు మాయం అయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై శనివారం రాత్రి టీటీడీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి అన్నగారైన శ్రీగోవిందరాజస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో శ్రీరామానుజాచార్యులు నిర్మించారు. తిరుమల కొండకు వచ్చిన ప్రతి భక్తుడు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామిని దర్శించుకుంటారు. శ్రీవారికి సమర్పించినట్టే గోవిందరాజస్వామికి కూడా రాజులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బంగారు, వజ్రాలతో పొదిగిన ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో పొదిగిన కిరీటాలు కానుకలుగా సమర్పించారు. కాగా శ్రీగోవిందరాజస్వామికి ప్రధానంగా ఐదు బంగారు కిరీటాలు ఉన్నట్లు సమాచారం. అయితే నిత్యం స్వామి వారికి అలంకరించి ఉండే మూడు కిరీటాలు మాయమయ్యాయి. మాయమైన మూడు కిరీటాలను ‘సదా సమర్పణ’ కిరీటాలు అని అంటారు.

వజ్రాలతో తయారు చేయించిన ఈ కిరీటాలు మూడు 1.300 కిలోలు బరువు ఉంటాయని వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే ఆలయంలో ఉత్సవ మూర్తులకు అలంకరించే మూడు విలువైన బంగారు కిరీటాలు మాయమైన విషయం శనివారం సుప్రభాత సేవ సమయంలోనే తెలిసినట్లు సమాచారం. ఆ వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ కిరీటాలు ఆలయంలో పనిచేసే వారికి తెలియకుండా మాయమయ్యే అవకాశం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు? ఎలా మాయం చేశారనే విషయంపై తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్, టీటీడీ విజిలెన్స్‌ అధికారులు, క్లూస్‌ టీం విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ పుటేజిలను పరిశీలిస్తున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులను విచారిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో పనిచేసే అధికారి ఒకరు విలువైన ఆభరణాలను మాయం చేసి తాకట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతుండగానే... తాజాగా  శ్రీగోవింద రాజస్వామి ఆలయంలో బంగారు కిరీటాలు మాయం కావడం సంచలనంగా మారింది.    

మరిన్ని వార్తలు