మావోల దాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ దుర్మరణం

28 Oct, 2018 12:54 IST|Sakshi

గిద్దలూరు: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజాపూర్‌ జిల్లా ముర్దొండ ప్రాంతంలో శనివారం సాయంత్రం మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. వీరిలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరానికి చెందిన చట్టి ప్రవీణ్‌కుమార్‌ (24) ఉన్నారు. సేకరించిన సమాచారం ప్రకారం ప్రవీణ్‌ కుమార్‌ సహచర సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో కలిసి వారి క్యాంపునకు సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. అందులో గౌతవరానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో పాటు విశాఖపట్నం జిల్లాకు చెందిన గల్లిపల్లి శ్రీను మృతిచెందారు.

 ప్రవీణ్‌కుమార్‌ వినాయకచవితి పండుగ కోసం సెలవుపై స్వగ్రామం వచ్చి ఈనెల 15వ తేదీన తిరిగి విధులకు వెళ్లాడు. ఇంతలోనే కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, రంగలక్ష్మమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఉన్నతంగా చదివిం చుకోవాలన్న ఆశపడ్డామని... ఆర్థిక స్థోమత లేక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా పంపించామని.. చేతికి అందివచ్చిన కొడుకు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌కు ఒక చెల్లెలు ఉంది. ప్రవీణ్‌ మరణ వార్తను సీఆర్‌పీఎఫ్‌ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రవీణ్‌ మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు