ఖాళీలే.. ఖాళీలు..!

28 Dec, 2014 02:33 IST|Sakshi
ఖాళీలే.. ఖాళీలు..!

కీలకమైన విభాగాలకు సారథులు కరువు
పడకే సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
ఇన్‌చార్జిల పాలనలో డ్వామా, డీఆర్‌డీఏ
పలు శాఖల్లో అధికారులు లేక అస్తవ్యస్తం
కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం
 

కర్నూలు(అగ్రికల్చర్) :  కీలక ప్రభుత్వ విభాగాలకు సారథులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇవన్నీ సక్రమంగా అమలు కావడానికి, ఆశించిన ఫలితాలు రావడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అధిపతులు ఉండాలి. అప్పుడే పర్యవేక్షణ పెరుగుతుంది. పథకాలు సక్రమంగా అమలు అవుతాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు అధిపతులు లేకపోవడంతో వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు పడకేసినట్లు అయింది.

ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందువల్ల వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లోతుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు 100 శాతం విజయవంతం కావాలని, ఆ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అబ్బో! కలెక్టర్ చండశాసనుడట..ఆయన దగ్గర పని చేయలేము.. అంటూ ఇక్కడికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు జిల్లాకు రావడానికి ప్రయత్నించి మానుకున్నట్లు తెలుస్తోంది.

సారథులు లేని డ్వామా డీఆర్‌డీపీ..

ఒకవైపు వ్యవసాయ కూలీలు సంక్షేమానికి, గ్రామాభివృద్ధికి, మహిళా సంక్షేమానికి పేదరిక నిర్మూలనలో డ్వామా, డీఆర్‌డీఏ-వెలుగు కీలకమైనవి. డ్వామాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్, వాటర్‌షెడ్, ఇందిర జలప్రభ కింద వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. డీఆర్‌డీఏ-వెలుగు ద్వారా మహిళా సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఈ రెండింటికీ సారథులు లేకపోవడం గమనార్హం. డ్వామా పీడీ పోస్టు దాదాపు 3 నెలలుగా ఖాళీగా ఉంది. మొదట ఇన్‌చార్జి పీడీగా జేడీఏ ఠాగూర్‌నాయక్ కొద్ది రోజులు పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి ఇన్‌చార్జి పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ-వెలుగు పీడీగా పనిచేస్తున్న నజీర్ సాహెబ్‌ను మాతృ సంస్థకు బదిలీ చేసినా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో కలెక్టర్.. పీడీ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జేసీ నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నందున డీఆర్‌డీఏ-వెలుగు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆత్మ గతి.. అథోగతి...

వ్యవసాయ శాఖలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అందిస్తుంది. ఆత్మను పట్టించుకునే దిక్కు లేదు. జేడీఏ స్థాయిలో పీడీ, డీడీఏ స్థాయిలో ఇద్దరు డిప్యుటీ పీడీ పోస్టులు ఉన్నాయి. ఆత్మ ద్వారా రూ.2 కోట్లకు పైగా నిధులతో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పీడీ, డీపీడీ పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇన్‌చార్జి అధికారులు ఆత్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కీలక శాఖలకు అధికారులు లేరు..

పౌర సరఫరాల శాఖ ఎంతో కీలకమైంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ శాఖ ద్వారానే నడుస్తుంది. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయించే బాధ్యత ఈ శాఖదే. కీలకమైన శాఖకు జిల్లా అధికారి(డీఎస్‌ఓ) లేరు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్‌ఓను బదిలీ చేసిన ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీడీ ఉంటేనే హాస్టళ్ల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్యకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు హాస్టళ్లు అస్తవ్యస్థంగా మారాయి. మరోవైపు స్కాలర్‌షిప్ సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ పీడీ అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
 
ఆ రెండు విభాగాలకు ఎస్‌ఈలు లేరు..


కీలకమైన పంచాయతీరాజ్ ఆర్‌డబ్ల్యూస్‌లకు ఎస్‌ఈలు లేరు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులే ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్‌లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో మంచినీటి పథకాలు, సీపీడబ్ల్యూ స్కీమ్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ ఎస్‌ఈలు లేక అభివృద్ధి కార్యక్రమాల అమలులో పురోగతి కొరవడింది.

దిక్కులేని పెద్దాసుపత్రి...

నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే కర్నూలు పెద్దాసుపత్రికి సారధి లేరు. సూపరింటెండెంట్‌గా పనిచేసే డాక్టర్ ఉమామహేశ్వర్ సెలవుల్లో పోవడంతో ఇన్‌చార్జి సూపరింటెండెంటు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి వైస్ ఛాన్స్‌లర్ పోస్టు ఖాళీగా ఉంది.వయోజిన విద్యాశాఖకు నెలల తరబడి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో దాదాపు రెండేళ్లుగా సెక్రటరీ ఖాళీగా ఉంది. కీలకమైన వాటికి సారధులు లేకపోవడంతో రోగులకు, విద్యార్థులకు, రైతులకు సరైన సేవలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రెగ్యులర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు