అయోమయంలో క్రషింగ్‌

23 Feb, 2019 08:17 IST|Sakshi
భీమసింగి సుగర్స్‌

భీమసింగి చక్కెర కర్మాగారానికి అడుగడుగునా అవాంతరాలు

మళ్లీ నిలిచిపోయిన సుగర్స్‌ క్రషింగ్‌

మరో ఐదు రోజులవరకూ ఇదే పరిస్థితి మొదటినుంచీ పరిశ్రమపై పాలకుల నిర్లక్ష్యం

దిక్కుతోచనిస్దితిలో చెరకు రైతులు

భీమసింగి చక్కెర కర్మాగారంపై ఈ సర్కారు మొదటినుంచీ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తోంది. రైతుల సంక్షేమం... కార్మికుల భవిష్యత్తును కనీసం పట్టించుకోకుండా... పరిశ్రమ అవసరాలు తీర్చడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పాతబడిన యంత్రాల పుణ్యమాని తరచూ మొరాయిస్తూ రైతాంగం సహనాన్ని పరీక్షిస్తోంది. అసలే ప్రకృతి సహకరించక పంట నష్టం చవిచూస్తున్న రైతాంగానికి క్రషింగ్‌ ఆలస్యం అవుతుండటంతో రికవరీ శాతం తగ్గి మరింత నష్టపోవాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

విజయనగరం, జామి(శృంగవరపుకోట): జిల్లాలో ఏకైక విజయ రామ సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్‌ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎప్పటి కప్పుడు కర్మాగారం మొరాయిస్తోంది. యంత్రాలు పురాతనమైననవి కావడంతో తరచూ పాడైపోయి ఎప్పటికప్పుడు క్రషింగ్‌ నిలిచిపోతోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా ఈ సర్కారు పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్న ఆందోళన రైతుల్లో పెల్లుబుకుతోంది. కర్మాగారానికి ఆయువు పట్టు వంటి మిల్లు టర్బయిన్‌ మళ్లీ పాడవడంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి క్రషింగ్‌ నిలిచిపోయింది. దీనిని బాగు చేసేందుకు హైదరాబాద్‌ పంపించారు. దానిని తీసుసుకువచ్చి పునరుద్ధరించడానికి కనీసం ఐదు రోజులైనా సమయం పడుతుంది. యార్డులో గుట్టలుగా చెరకు పేరుకుపోవడంతో ఎండకు ఎండిపోవడంతో రికవరీ శాతం తగ్గిపోతుందని రైతాంగం ఆందోళన చెందుతోంది.

చెరకు తరలింపు అడ్డగింత
కర్మాగారం యాజమాన్యం యార్డులో ఉన్న చెరకును సంకిలి చెరకు ఫ్యాక్టరీకి తరలించాలని యత్నించడంతో దానిని చెరకు రైతులు అడ్డుకున్నారు. నష్టాలైనా భరిస్తాం గానీ... ఇక్కడే క్రషింగ్‌ చేయాలని వారు పరిశ్రమ ఎండీ వి.వి.రమణారావుకు ఖరాఖండీగా చెప్పడంతో చేసేది లేక చెరకు తరలింపు యోచన విరమించుకున్నారు. వేరొక కర్మాగారానికి చెరకు తరలిస్తే క్రషింగ్‌ తగ్గి నిబంధనల ప్రకారం వచ్చే సీజన్‌కు క్రషింగ్‌కు అనుమతులు ఉండవేమోనని రైతులు భయపడుతున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం
గడిచిన నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని పట్టించుకున్న పాపాన పోలేదు. 40 సంవత్సరాల క్రితం నాటి యంత్రాలను ఆధునికీకరించడానికి ఏమాత్రం చొరవ చూపడం లేదు. ఇప్పటికే రూ. 38 కోట్లు నష్టాల్లో కూరుకుపోయినా ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే జాతీయ సహకార సంస్థ 9శాతం వడ్డీకి రుణం అందిస్తుంది. తద్వారా పరిశ్రమను ఆధునికీకరించుకోవచ్చు. తద్వారా మళ్లీ కష్టాలనుంచి గట్టెక్కే అవకాశం ఉంది. కానీ ఇక్కడి నాయకులు ఆ ప్రయత్నమేదీ ఇన్నాళ్లూ చేయకుండా... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదో హడావుడిగా ఒత్తిడి తేవడంతో గ్యారంటీ ఇస్తామని హడావుడిగా ప్రకటించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రషింగ్‌ సీజన్‌ కూడ ముగిసిపోవచ్చింది. ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వక పోవడంతో కర్మగారంలో ఉన్న పంచదారను ఆప్కాబ్‌కు తాకట్టు పెట్టి 12శాతం వడ్డీకి రుణం తెచ్చి చెరకు రైతులకు అరకొరగా బకాయిలు చెల్లించారు. దీనివల్ల రైతాంగం ఇబ్బందులు పడింది. కార్మికులకు కూడా ఇటీవలే రెండు నెలలు వేతనాలు ఇచ్చారు. మళ్లీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నా సర్కారు కనీసం ఇటువైపు కన్నెత్తి చూడట్లేదు.

అరకొర చెల్లింపు
జాతీయ సహకార సంస్థ నుంచి రావాల్సిన రుణం రూ. 30కోట్లు రాకపోవడంతో జనవరి 15వ తేదీవరకూ సరఫరా చేసిన చెరకునకే బిల్లులు అందించారు. అదీ టన్ను చెరకుకు రూ. 2,625లు కాగా రూ. 2,200లే చెల్లించారు. గతంలో 15రోజులకోసారి చెల్లించేవారని ఇప్పుడు ఆ స్థాయిలో డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిపోయిన రికవరి
కర్మగారం క్రషింగ్‌కు ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవడం, పురాతన యంత్రాలతోనే కాలం గడిపేయడంతో రికవరీ శాతం భారీగా పడిపోయి 8.85శాతం మాత్రమే వచ్చింది. ఇప్పటివరకు 55వేల మెట్రిక్‌ టన్నులు క్రషింగ్‌ చేసి 46,305 బస్తాల పంచదారను ఉత్పత్తి చేయగలిగింది. పురాతన యంత్రాలు కావడంతో కర్మాగారంలో బెగాస్‌ మిగలక బయట కర్మగారాల నుంచి బెగాస్‌ కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. దీనివల్ల మరింత ఆర్థిక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోంది.

తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
కర్మాగారం క్రషింగ్‌ ఎప్పటికప్పుడు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు ఎవ్వరూ పట్టించుకోలేదు. చెరకు వేరొక ప్రాంతానికి తరలిస్తే వచ్చే ఏడాది క్రషింగ్‌కు అనుమతులు రావు. అందువల్ల ఇక్కడే క్రషింగ్‌ చేయాలి. అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం అన్యాయం.   – సీహెచ్‌.వెంకటరావు,రైతు సంఘం నేత, జామి

మరిన్ని వార్తలు