మూడు వారాలు కఠినంగా లాక్‌డౌన్‌ 

27 Mar, 2020 04:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : వచ్చే మూడు వారాల పాటు లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. కోవిడ్‌–19పై గురువారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ఏ విధంగా అమలవుతున్నదీ ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలను అడిగి తెలుసుకున్నారు.  

కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఆదేశాలు ఇలా.. 
►లాక్‌డౌన్‌లో రానున్న మూడు వారాలు చాలా కీలకం. అందువల్ల నిత్యావసర సరుకులు   రవాణా చేసే లారీలు, ట్రక్కులు, గూడ్స్‌ వాహనాలు నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా అన్ని చెక్‌పోస్టుల వద్ద ఆటంకం కలుగకుండా చూడాలి. 
►మందులు, ఇతర నిత్యావసర వస్తువులు ఇళ్ల వద్దకే సరఫరా చేసే డెలివరీ బాయ్‌లకు కూడా అవకాశం ఇవ్వాలి.  నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చూడాలి.    
►లాక్‌ డౌన్‌ వల్ల ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వేరే రాష్ట్రాల వారికి భోజనం, వసతి కల్పించాలి. 
►ప్రత్యేకంగా కోవిడ్‌కు చికిత్స కోసం కొన్ని ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలి. అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలి. వైద్య పరికరాలను సమకూర్చుకోవాలి. 
►దేశ వ్యాప్తంగా 8 లక్షల మందికిపైగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారికి సూచనలు, సలహాలు, వైద్యం అందిస్తున్నందుకు అన్ని రాష్ట్రాలకు అభినందనలు. 

రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోంది : సీఎస్‌ నీలం సాహ్ని
►రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాం. 
►కూరగాయలు, నిత్యావసరాల సప్లయ్‌ చైన్‌ సక్రమంగా సాగుతోంది. 
►ఇందుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో 1902 నంబర్‌తో కూడిన కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. }
►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 22న ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, పప్పు.. వలంటీర్ల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రహదారులు–భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు