విద్యాసంస్థలకు సెలవులు

19 Mar, 2020 03:25 IST|Sakshi

కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశం

స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలకు నేటి నుంచి నెలాఖరు వరకు సెలవులు

పరీక్షలు రాసే వారికి మాత్రమే హాస్టళ్లలో అనుమతి

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, వసతి గృహాలు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు సహా కోచింగ్‌.. శిక్షణ కేంద్రాలన్నీ ఈ నెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకూ మూసి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పీవీ రమేష్‌లతో సమీక్షించిన తర్వాత ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 10 మందికి మించి ప్రజలు ఒక చోట గుమిగూడకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్స్‌ (మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్‌ దూరం) పాటించేలా ప్రజలందరిలో అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కింది విధంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 

సోషల్‌ డిస్టెన్స్‌ ప్రధానం
– రైతు బజార్లు మార్కెట్లు, సంతలు, షాపులు, షాపింగ్‌ మాల్స్, ఇతర ముఖ్యమైన వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.
– రానున్న 15 రోజులు అత్యంత కీలకం. అందువల్ల ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.  
– ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలో తగిన శానిటైజేషన్‌ జాగ్రత్తలు తీసుకోవాలి.
– ప్రైవేట్‌ సంస్థలు వారి కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇంటి నుంచే పని చేసేలా చూడాలి.
– హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో నిరంతరం తగిన శానిటైజేషన్‌ ప్రొటోకాల్‌ జాగ్రత్తలు పాటించాలి.
– సభలు, సమావేశాలు నిర్వహించాల్సి వస్తే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించాలి.
– విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు కుటుంబ సభ్యులు సహా ఎవరితో కలవకుండా ఇంట్లో విడిగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి. 

యథావిధిగా బోర్డు పరీక్షలు
– ఇప్పటికే షెడ్యూళ్లు ప్రకటించి ఉన్న వివిధ బోర్డుల పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. 
– పరీక్షలు రాసే విద్యార్థుల్లో ఎవరికైనా జ్వర లక్షణాలుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు రాయించాలి. – ఈ పరీక్షలకు హాజరయ్యే వారిని మినహాయించి ఇతర విద్యార్థులకు హాస్టళ్లలో సెలవులు వర్తింపచేయాలి. 
– విద్యార్థులకు ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి వస్తే సెలవుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించుకోవాలి.   

కరోనా వైరస్‌ నిరోధానికి పటిష్ట చర్యలు 
రాష్ట్రంలో విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ ఇప్పటికే 88 శాతం పూర్తయింది. అన్ని క్రీడా మైదానాలను మూసి వేయాలి. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, అత్యవసరమైతే మినహా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అధికారులు ప్రజలకు వివరించాలి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ద్వారా వచ్చే పార్శిళ్లను స్వీకరించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆసుపత్రుల్లో రోగులను వారి బంధువులు, స్నేహితులు కలవకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి.
– డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా