పీల్చేది కడలంత..విదిల్చేది కడవంత

7 Jul, 2014 01:08 IST|Sakshi
పీల్చేది కడలంత..విదిల్చేది కడవంత

 కోనసీమ కడుపును కుళ్లబొడిచి, అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలను తరలించుకుపోతూ, రెండుచేతులా ఆర్జిస్తున్న సంస్థలకు.. ఆ గడ్డ బాగుకు నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావడం లేదు. చమురు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్)గా అవి  ఆర్జించే లాభాల్లో రెండు శాతం వాటి కార్యకలాపాలు, వ్యాపారాలు జరిగే ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాలన్న నిబంధన కాలం చెల్లిన పైపులైన్లకులా తుప్పు పట్టిపోతోందే తప్ప సక్రమంగా అమలు కావడం లేదు.
 
 అమలాపురం టౌన్ :ఎంతసేపూ ఈ పచ్చనిసీమ సహజ సంపదలను అధికారికంగా దోచేసుకోవటమే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామన్న చొరవ కొరవడుతోంది చమురు సంస్థలకు. నాణ్యత లేకుండా నిర్మించిన గ్యాస్ పైపు లైన్లకు కాలం చెల్లుతున్నా మొక్కుబడి మరమ్మతులు చేస్తాయే తప్ప కొత్త లైను నిర్మాణానికి  నిధులు వెచ్చించవు. నగరం గ్యాస్ పైపులైను పేలుడు.. 21 మందిని పొట్టన పెట్టుకుని చమురు సంస్థల చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రమాదకరమైన విస్ఫోటంగా మిగిలింది.
 
 క్రూర చెలగాటాన్ని గ్రహించిన ప్రజలు
 గత రెండు దశాబ్దాలుగా కోనసీమలో బ్లో అవుట్లు, పైపులైన్ల లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు భీతిల్లుతూనే ఉన్నారు. అయితే నగరం దుర్ఘటన వరకూ అవి ఆస్తినష్టానికే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇంతమంది నిలువునా బుగ్గయిపోవడంతో చమురు సంస్థలు తమ ప్రాణాలతో ఎంత క్రూరంగా చెలగాటమాడుతున్నాయో ఈ గడ్డప్రజలకు అర్థమైంది. చమురు సంస్థలు సీఎస్‌ఆర్ నిధులంటూ అరకొరగా విడుదల చేసి చిన్న చిన్న వంతెనలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించటం, పాఠశాలలకు ఫర్నీచర్, పుస్తకాలు. తాగునీటి సాకర్యాల వంటి వాటికే పరిమితమవుతున్నాయి. వంతెనలు, రోడ్ల నిర్మాణానికి నిధులిచ్చినా వాటిపై రోజూ తిరిగే ఆ సంస్థల భారీ వాహనాల తాకిడికే ధ్వంసమవుతున్నాయి. సీఎస్‌ఆర్ నిధుల కేటాయింపు కాగితాల్లో ఉన్న స్థాయిలో కార్యరూపంలో కనిపించటం లేదు. ఆ నిధులను నిబంధనలకు అనుగుణంగా ఖర్చుచేయాల్సిన జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులూ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. జిల్లాలో  ఓ మాజీ ఎంపీ సీఎస్‌ఆర్ నిధులను ఓ ప్రైవేటు కళాశాలకు ఇచ్చిన విషయం వివాదాస్పదమైంది. అలాగే జిల్లా ఉన్నతాధికారి సీఎస్‌ఆర్ నిధులను అనర్హమైన ప్రాంతాలకు వెచ్చించారన్న ఆరోపణ ఉంది.
 
 పెచ్చరిల్లుతున్న నిరసన
 గత పదేళ్లలో గెయిల్ సంస్థ తన కార్యకలాపాల ద్వారా రూ.1683 కోట్లు ఆర్జించింది. అందులో రెండు శాతం నిధులు అంటే దాదాపు రూ.34 కోట్లు కేజీ బేసిన్‌లో కార్యకలాపాలు సాగించే ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించాలి. అయితే ఆ మేర నిధులు విడుదల కాలేదు. నగరం దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.3.80 కోట్లు మాత్రమే ఇచ్చింది. వారి తప్పిదం వల్ల ఘోర ప్రమాదం జరిగింది కాబట్టి ఆ నిధులైనా ఇచ్చారు. అదే సీఎస్‌ఆర్ నిధులు అయితే అంత తొందరగా మంజూరుకు నోచుకోవు. అలాగే గత పదేళ్లలో ఓఎన్జీసీ రూ.2957 కోట్లు ఆర్జించింది.
 
 కేజీ బేసిన్ ప్రాంతాలకు సీఎస్‌ఆర్ కింద దాదాపు రూ.60 కోట్లు కేటాయించాలి. గతం గతః అనుకున్నా ప్రస్తుతం ఓఎన్జీసీ సీఎస్‌ఆర్ కింద తాజాగా ఇవ్వాల్సిన రూ.26 కోట్లు విడుదల చేయటంలో జాప్యం చేస్తోంది. తమ ప్రాణాలకు మంట పెట్టటమే కాక నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన నిధులూ ఎగవేస్తున్న చమురు సంస్థలపై ప్రజలు కడుపుమండి ఎదురు తిరిగితే తప్పేముంది? ఆ సంస్థల కార్యకలాపాలను అడ్డుకుంటే తప్పేమిటి? నగరం ఘటన తర్వాత కోనసీమ ప్రజల నిరసన గళం ఇది. ఈ గళం నిప్పులగోళంలా జ్వలించి, తమ కార్యకలాపాలకే ఎసరు పెట్టేవరకూ నిర్లిప్తంగా ఉంటాయో లేక సకాలంలో స్పందించి తమ బాధ్యతను నూరుశాతం నిర్వర్తిస్తాయో.. చమురు సంస్థలే  నిర్ణయించుకోవాలి.                            

మరిన్ని వార్తలు