‘కళా’ గారూ.. కాపాడరూ?

22 May, 2019 11:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో జరిగిన ఇంక్రిమెంట్ల కుంభకోణంలో సూత్రధారులైన అధికారుల్లో కలవరం మొదలైంది. చర్యల నుంచి తప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఎలాగైనా కాపాడంటూ విద్యుత్తు శాఖ మంత్రి కళా వెంకట్రావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఈపీడీసీఎల్‌లో ఇంక్రిమెంట్ల స్కాం’ శీర్షికతో ఇటీవల సాక్షి ప్రథాన సంచికలో కథనం ప్రచురించిన సంగతి విధితమే.ఈ వ్యవహారంలో 32 మంది ఉద్యోగులకు అడ్డగోలుగా రెండు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, దీనిని ట్రాన్స్‌కో కూడా తప్పు పట్టిన నేపథ్యంలో ఈ ఇంక్రిమెంట్ల సొమ్మును వడ్డీతో సహా రికవరీ చేయాలని ఈపీడీసీఎల్‌ సీఎండీ రాజబాపయ్య ఉత్తర్వులిచ్చారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. దీంతో సూత్రధారుల్లో కలవరం మొదలైంది.

ఇదీ పరిస్థితి
నిబంధనలకు విరుద్ధంగా ఇంక్రిమెట్లు పొందిన వారిలో విశాఖపట్నం ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో 12 మంది, ఇతర సర్కిళ్లలో మరో 20 మంది వెరసి 32 మంది ఉద్యోగులున్నారు. వీరు ఇంక్రిమెంట్లు పొందడంలో కీలక పాత్ర పోషించిన వారిలో సీజీఎంలు, ఎస్‌ఏవో, ఏఏవోలతో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. ఉద్యోగులకు లక్షలాది రూపాయలు లబ్ధి చేకూర్చడానికి వీరు వివిధ రూపాల్లో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో తమపై చర్యలు తీసుకోకుండా చూడాలంటూ విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావును ఈ అధికారులు ఆశ్రయించినట్టు తెలిసింది.  ఇందులో జోక్యం చేసుకుంటే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో వారికి భరోసా ఇవ్వలేదని సమాచారం.   

మరిన్ని వార్తలు