చందన హత్య కేసులో నిందితుల అరెస్టు

17 Jan, 2014 08:56 IST|Sakshi
నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన పోలీసులు

మతాంతర వివాహం చేసుకున్న చందనప్రియను హతమార్చిన కేసులో నిందితులు రామ్‌నగర్‌కు చెందిన షేక్ ఇస్సామ్, షేక్ నిస్సార్ ఉద్దీన్ అలియాస్ నిస్సార్ అహ్మద్ అలియాస్ దినా, షేక్ ఉస్సేన్ పీరాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి  ఒక పిడిబాకు, రక్తము తుడిచిన గుడ్డలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం శివారులోని బుక్కరాయసముద్రం గ్రామంలోని మహ్మద్ దవానుగుట్ట వద్ద అరెస్టు చేసినట్లు టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ రెడ్డప్ప వెల్లడించారు.


 
 చందనను పాశవికంగా హత్య చేసిన ఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో మృతురాలి చిన్నాన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు అనంతపురం డీఎస్పీ నాగరాజ, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు నగర టూ టౌన్ పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగారు. సీఐ, ఎస్‌ఐ తెలిపిన మేరకు.. ప్రేమ వివాహం చేసుకున్న చందనప్రియ, ఇషాక్ స్థానిక రామ్‌నగర్ ఈ-సేవా రోడ్డులో శ్రీజ్ఞాన సరస్వతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ సమీపంలో నివాసముంటున్నారు. ఆమెను వివాహం చేసుకున్నప్పటి నుంచి భర్త తన చెల్లెలను, తమ్ముడిని, ఇతర బంధువులను సక్రమంగా చూడడం లేదు. వారి పెళ్లయినప్పటి నుంచి ఆమె మరిది షేక్ నిస్సార్‌కు అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.


 
 దీనికి తోడు చందన తన మరిదికి భోజనం కానీ, టిఫిన్ కానీ పెట్టేది కాదు. చీటికీమాటికి సూటిపోటి మాటలు అనేదని, దీంతో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మరిది ఆమెపై ఈర్ష, ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మధ్యాహ్నం 12 గంటల సమయంలో వదిన చందనతో షేక్ నిస్సార్ అహ్మద్ గొడవ పడి, ఆమెను కత్తితో ఎడమవైపు మెడకు, చెవి కింద బలంగా పొడిచి చంపి పారిపోయాడు. అనంతరం హతురాలి ఇద్దరు కూతుళ్లను తన అక్క ఇంటిలో వదిలడంతో ఆమె అనుమానంతో చందన భర్తకు ఫోన్ చేసి చెప్పింది.


 
 అతను వెంటనే ఇంటికి వెళ్లి చూడగా అప్పటికే భార్య చందన చనిపోయి ఉంది. వెంటనే తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అందరూ చర్చించుకుని నిస్సార్‌ను కాపాడేందుకు ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న హతురాలి రక్తాన్ని దుప్పట్లతో శుభ్రం చేసి, వాటిని రవి పెట్రోలు బంకు వద్ద మురికి కాలువలో పడేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఎవరికీ చెప్పకుండా అశోక్‌నగర్‌లోని మరానీ కబరస్తాన్‌లో పూడ్చి వేశారు. కాగా ఈ కేసును త్వరగా ఛేదించి నిందితులిన అరెస్ట్ చేసిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


 
 చందన మృతదేహానికి పోస్టుమార్టం..
 చందనప్రియ మృతదేహానికి స్థానిక అశోక్ నగర్ శ్మశాన వాటికలో తహశీల్దార్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. టూ టౌన్ సీఐ మన్సూరుద్దీన్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో డాక్టర్ శంకర్ పోస్టుమార్టం చేశారు. గొంతుకు పక్క భాగాన, ఎడమ కంటికి కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి నివేదిక మూడు వారాల అనంతరం వెల్లడిస్తామని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు