గాడిద పాలకు యమ గిరాకీ!

18 Dec, 2013 18:27 IST|Sakshi
గాడిద పాలకు యమ గిరాకీ!

కడివేనైననేమి ఖరము పాలు అనే మాట పాతబడి పోయింది. గాడిద పాలు గుక్కెడైన చాలు అంటున్నారు విశాఖ జిల్లా వాసులు. గాడిద పాల కోసం ఎగ బడుతున్నారు. దీంతో ఖరము పాలకు విశాఖ జిల్లాలో గిరాకీ పెరిగింది. గాడిద పాలు తాగితే ఆస్తమా, ఉబ్బసం, నెమ్ము, ఆయాసం, దగ్గు వంటి రోగాలు రావన్న నమ్మకంతో వీటిని కొనేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.

ఇటీవల పెరిగిన చలికి సామాన్యులే వణికిపోతున్నారు. ఇక జలుబు, ఉబ్బసంతో బాధపడేవారి పరిస్థితి మరీ దారుణం. అలాంటివారికి గాడిదపాలు ఔషధంలా పనిచేస్తాయని అంటున్నారు విశాఖ వాసులు. ముఖ్యంగా భీమిలి, తగరపువలసలో ఈ నమ్మకం బాగా ఎక్కువగా ఉంది. దాంతో అక్కడ గాడిదపాలకి గిరాకీ ఎక్కువైంది. వీధుల్లో తిరుగుతూ గాడిద పాలు అమ్ముతున్న వారి వద్ద స్థానికులు క్యూ కడుతున్నారు. గాడిదను వెంట బెట్టుకుని ఇళ్లకు వద్దకు వచ్చి అక్కడికక్కడే పిండి ఇస్తున్న పాల కోసం ఎగబడుతున్నారు.

అయితే గాడిద పాలు కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మిల్లీలీటర్ల పాలకే వందల రూపాయలు పెట్టాల్సివస్తోంది. లీటర్ పాలు 5 వేల రూపాయల వరకు పలుకుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఈ పాలకు డిమాండ్‌ ఉందని గాడిదలను తీసుకొచ్చిన వారు చెబుతున్నారు. పలు చోట్ల పాలను అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. గాడిద పాలతో ఉపయోగముందో తెలియదు గాని జనం మాత్రం ఎగబడి పాలను కొంటున్నారు.

మరిన్ని వార్తలు