మరోసారి నగదు కటకట!

10 Mar, 2017 19:50 IST|Sakshi
మరోసారి నగదు కటకట!

ఒక్కసారిగా తగ్గిన రూ. 2,000 నోట్ల చలామణి

సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు దొరకక తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు మరోసారి ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా బ్యాంకుల ఏటీఎంల ముందు నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం, ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటం కూడా నగదు కొరతకు ప్రధాన కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. సహజంగా ఆర్థిక సంవత్సరం చివరి నెలల్లో లక్ష్యాలు చేరుకోవడానికి రుణాలు మంజూరు చేయడం, బిల్లుల చెల్లింపులు వంటివి ఉండటంతో నగదుకు డిమాండ్‌ అధికంగా ఉంటుందంటున్నారు. అలాగే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి రూ. 2,000 నోట్ల చెలామణి ఒక్కసారిగా తగ్గిపోవడం గమనార్హం.

బ్యాంకు నుంచి బయటకు వెళ్లిన తర్వాత పెద్దనోట్లు తిరిగి వెనక్కి రావడం లేదని ఒక ప్రభుత్వరం రంగ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే వారికి కేవలం రూ. 100 నోట్లు మాత్రమే ఇవ్వమని, రూ. 2,000, రూ. 5,00 నోట్లు ఇవ్వొద్దని ఉద్యోగులకు ఆదేశాలు వచ్చాయంటే పెద్ద నోట్ల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన బ్యాంకులతో పోలిస్తే దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ ఎస్‌బీఐలో నగదు కొరత ఎక్కువగా కనిపిస్తుంటే, ప్రైవేటు బ్యాంకుల్లో నగదు కొరత కొంత తక్కువగా ఉంది. గత వారం రోజుల నుంచి నగదు సరఫరా కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ, పరిస్థితులు చేయిదాటిపోయే విధంగా లేవని ఆంధ్రాబ్యాంక్‌ డీజీఎం కృష్ణారావు తెలిపారు.

గురువారం రాష్ట్రానికి ఆర్‌బీఐ నుంచి రూ. 1,560 కోట్లు వచ్చాయని, ఈ మొత్తాన్ని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పంపిణీ చేశామని చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తర్వాత లావాదేవీలపై విధించిన వివిధ పరిమితులు సోమవారం నుంచి పూర్తి స్థాయిలో తొలగి పోనుండటంతో పరిస్థితులు చక్కబడతా యన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా పెద్ద నోట్ల రద్దు వల్ల ఏపీ నుంచి రూ. 71 వేల కోట్లు బ్యాంకులకు జమకాగా.. ఇప్పటివరకు కేవలం రూ. 39 వేల కోట్లు మాత్రమే రావడం గమనార్హం.

రాష్ట్రంలోని బ్యాంకులలో నగదు కొరతపై సీఎం చంద్రబాబు గురువారం రాత్రి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశానని, మరోసారి ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. రాష్ట్రానికి సరిపోయేలా నగదు సరఫరా పెంచాలని కోరనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు