కరెంట్ కట్.. నీళ్లు బంద్

3 Jan, 2014 03:04 IST|Sakshi

హుజూరాబాద్, న్యూస్‌లైన్ : పల్లెలపై ప్రభుత్వ అలసత్వానికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల జనం అగచాట్లు పడుతున్నారు. రూ.లక్షల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలోని ఫిల్టర్‌బెడ్‌కు మూడు రోజుల క్రితం కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో హుజూరాబాద్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, శంకరపట్నం మండలాల్లోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
 
 తుమ్మనపల్లి ఫిల్టర్‌బెడ్‌కు సంబంధించి గతంలో రూ.14 లక్షల విద్యుత్ బకాయి ఉండడంతో ఓసారి కరెంటు సరఫరా నిలిపివేశారు. అప్పుడు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి రూ.6 లక్షలు చెల్లించగా, విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. తాజాగా మూడు రోజుల క్రితం మళ్లీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఫిల్టర్‌బెడ్ నిర్వహణ స్తంభించిపోయింది. ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటిని క్లోరినేషన్ చేసి పైపులైన్ ద్వారా గ్రామాలకు పంపింగ్ చేయాల్సి ఉండగా, మొత్తానికే చీకట్లు కమ్ముకోవడంతో నీటి సరఫరా బందయింది.
 
 వాటర్ ప్లాంట్ల వైపు చూపు..
 హుజూరాబాద్ నగరపంచాయతీతోపాటు మం డలంలోని తుమ్మనపల్లి, సింగాపూర్, బోర్నప ల్లి, ఇప్పలనర్సింగాపూర్, కాట్రపల్లి, కొత్తపల్లి, దమ్మక్కపేట, చిన్నపాపయ్యపల్లి, పెద్దపాపయ్యపల్లి, కందుగుల, పోతిరెడ్డిపేట, ధర్మరాజు పల్లి, రంగాపూర్, రాంపూర్, జూపాక, రాజపల్లి, చెల్పూరు, ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, జీల్గుల, జగన్నాథపూర్, భీమదేవరపల్లి మండ లం మాణిక్యాపూర్, కొప్పూరు, వంగర, రంగయ్యపల్లి, ముల్కనూరు, గట్ల నర్సింగాపూర్, శంకరపట్నం మండలం ఎరుకలగూడెం, మెట్‌పల్లి, ఆముదాలపల్లి గ్రామాలు పూర్తిగా తాగునీటి కోసం ఈ ఫిల్టర్‌బెడ్‌పైనే ఆధారపడతాయి. మూడు రోజుల క్రితం వచ్చిన నీటిని పొదుపు గా వాడుకున్నప్పటికీ నిన్నటికే అయిపోయా యి.
 
 నేటినుంచి అన్ని గ్రామాల్లో నీటి కటకట మొదలవుంది. దీంతో తమ అవసరాలను తీర్చు కునేందుకు జనం స్థానికంగా ఉన్న ప్యూరీఫైడ్ వాటర్‌ప్లాంట్లను ఆశ్రయించాల్సి పరిస్థితి ఏర్పడింది. ప్రతీసారి విద్యుత్ సరఫరా నిలుపుదల చేసే వరకు అధికారులు ఎదురుచూపులు చూడ డం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పుడు తాగునీటికి అల్లాడుతున్న 30 గ్రామాల ప్రజలకు ఏ సమాధానం చెపుతారో అధికారులే తేల్చుకోవాలి. త్వరలోనే విద్యుత్ బకాయి చెల్లించి నీటిసరఫరా అయ్యేలా చూస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కరుణాకర్ ‘న్యూస్‌లైన్’తో వివరించారు.  
 
 అందుకే మోడల్ రిజర్వాయర్ కావాలి
 ఫిల్టర్‌బెడ్ నీళ్లను నమ్ముకుంటే ప్రతీసారి సమస్యలే వస్తున్నాయి. హుజూరాబాద్ పట్టణంలో ఉన్న దాదాపు ఆరువేల ఇండ్లకు మంచినీటి సరఫరా శాశ్వతంగా ఉండాలంటే మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చితేనే ఫలితం ఉంటుంది.
 - అయిత హరీష్, మాజీ ఉపసర్పంచ్, హుజూరాబాద్
 

మరిన్ని వార్తలు