హే.. శ్రీరాం..!

27 Apr, 2019 11:18 IST|Sakshi
శ్రీరాం ఫైనాన్స్‌ కంపెనీకి తాళం వేసి నిరసనకు దిగిన బాధితుడు శంకరాచారి

రుణం చెల్లించినా పత్రాలు ఇవ్వని శ్రీరాం ఫైనాన్స్‌ కంపెనీ

ఆవేదనతో కార్యాలయానికి తాళం వేసిన బాధితుడు

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయితీ

15 రోజుల్లో పత్రాలు ఇచ్చేలా ఒప్పందం

అనంతపురం, కదిరి: కదిరిలో శ్రీరాం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కంపెనీ కార్యాలయానికి శుక్రవారం ఓ బాధితుడు తాళం వేశాడు. సిబ్బందిని లోనికి వెళ్లనీకుండా అక్కడే నిరసనకు దిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పి తాళం తీయించారు. బాధితుడి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎంజీ రోడ్‌లో కాపురముంటున్న బంగారు నగల వ్యాపారి శంకరాచారి తన అవసర నిమిత్తం ఇంటిని తాకట్టు పెట్టి మూడేళ్ల క్రితం రూ.45 లక్షలు శ్రీరాం ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా కంతులు చెల్లించుకుంటూ వచ్చాడు. చివర్లో రూ.4లక్షలు చెల్లించాల్సి ఉండగా కాస్త ఆలస్యమైనందుకు ఫైనాన్స్‌ కంపెనీ వారు దానికి అదనపు వడ్డీ వేశారు. సకాలంలో చెల్లించలేదని చివరకు ఆ ఇంటిని వేలం వేస్తున్నామంటూ పట్టణంలో దండోరా కూడా వేయించారు. అవమానభారంతో బాధితుడు రూ.కోటి విలువ చేసే ఇంటిని సగం ధరకే అమ్మేసి ఫైనాన్స్‌ కంపెనీలో అప్పులేదనిపించుకున్నాడు.  

పత్రాల కోసం పడిగాపులు
అప్పు మొత్తం చెల్లించానని, ఇక తాను తాకట్టు పెట్టిన ఇంటి ఒరినల్‌ పత్రాలు ఇవ్వాలని బాధితుడు సదరు కంపెనీ మేనేజర్‌ ప్రసాద్‌ను అడిగారు. పత్రాలు చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి పంపామని, త్వరలోనే తెప్పించి ఇస్తామని చెప్పడంతో ఆయన కొద్ది రోజులు ఓపిక పట్టాడు. తర్వాత ప్రతి రోజూ సదరు కార్యాలయానికి వెళ్లడం, పత్రాలు ఇవ్వండయ్యా.. అని ప్రాధేయ పడటం ఇలా 8 నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. అయినా వారిలో చలనం రాలేదు. చేసేది లేక నాలుగు నెలల క్రితం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల నుంచి ఆయనకు సరైన న్యాయం జరగలేదు.  

తాళంతో కొలిక్కి వచ్చిన సమస్య
అప్పు చెల్లించి ఎనిమిది నెలలైనా తన పత్రాలు ఇవ్వలేదని, పోలీసులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదన్న బాధతో  బాధితుడు శంకరాచారి శ్రీరాం ఫైనాన్స్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగాడు. ఉదయం పది గంటలకు సిబ్బంది తాళం తీయాలని చెబితే తన పత్రాలు ఇస్తేగానీ తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆయనకు మిత్రులు కొందరు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆయనకు నచ్చజెప్పి ఎలాగో తాళం తీయించి సిబ్బందిని లోనికి వెళ్లేలా చేశారు. తన సమస్య పరిష్కరించే వరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని మేనేజర్‌ చాంబర్‌లో కూర్చున్నాడు. చివరకు పట్టణ ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌ అక్కడికి చేరుకుని బాధితుడితో పాటు శ్రీరాం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ ప్రసాద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 15 రోజుల్లో అతని ఒరిజినల్‌ ఇంటి పత్రాలు తెప్పించి ఇస్తామని శ్రీరాం ఫైనాన్స్‌ అధికారులు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

కంతులు జాప్యంతోనే సమస్య
శ్రీరాం ఫైనాన్స్‌లో రుణం తీసుకున్న శంకరాచారి సకాలంలో కంతులు చెల్లించలేదు. రూ.4లక్షలు పెండింగ్‌ పెట్టాడు. పెద్దమనుషుల ఒప్పందంతో చివరకు సెటిల్‌ చేశాడు. అయితే మిగిలిపోయిన రూ.4లక్షలు కంప్యూటర్‌లో అపరాధ రుసుంతో కలిపి రూ.12 లక్షలు చూపుతోంది. అది సెటిల్‌ చేయిస్తే గానీ ఇచ్చేది లేదని పై అధికారులు చెబుతున్నారు. అందుకే పత్రాలు ఇవ్వడంలో జాప్యమైంది. త్వరలోనే తెప్పించి ఇచ్చేస్తాం.– ప్రసాద్, శ్రీరాంఫైనాన్స్‌ మేనేజర్‌ 

మరిన్ని వార్తలు