తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ ఆమోదం

30 Jul, 2013 19:08 IST|Sakshi

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో మంగళవారం సాయంత్రం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్యూసీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు.

అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధికారిక నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, ప్రతిపాదనల గురించి యూపీఏ సంకీర్ణ సర్కారు భాగస్వామ్యపక్షాల నేతలతో చర్చించారు. వారి ఆమోదం తీసుకున్న తర్వాత ఆ వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లాంఛనప్రాయంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాల్గొనున్నారు. ఈ భేటీకి సోనియాగాంధీతో పాటు పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. రాహుల్ గాంధీ, అజిత్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, శరద్ పవార్‌, ఫరూఖ్ అబ్దుల్లా, ముస్లింలీగ్ నేత అహ్మద్ లు ఈ భేటీకి హాజరైన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు