బాలిక వివాహంపై సీడబ్ల్యూసీ విచారణ

26 Mar, 2018 12:56 IST|Sakshi

డీసీపీవో యూనిట్‌కు నోటీసులు జారీ చేస్తాం

ఏలూరు టౌన్‌ :ఏలూరులో బాలిక వివాహంపై బాలల సంక్షేమ సమితి బెంచ్‌ అగ్రహం వ్యక్తం చేసింది. శనివారపుపేటలోని బాలుర వసతిగృహంలో ఆదివారం సాయంత్రం బాలిక బంధువులు, పోలీసులను బెంచ్‌ విచారించింది. తమ సంప్రదాయం మేరకు బాలికకు వివాహం చేయాలని నిశ్చయించామని, జీలకర్ర, బెల్లం కార్యక్రమాన్ని మాత్రమే చేశామని, బాలిక మేజర్‌ అయిన తరువాత వరుని ఇంటికి పంపుతామని, తప్పును మన్నించి తమకు అవకాశం ఇవ్వాలని బాలిక బంధువులు వివరణ ఇచ్చారు. బాలిక వివాహంపై సమాచారం వచ్చినా స్పందికపోవటంతోపాటు, బాలిక మేజర్‌ అంటూ పోలీస్‌ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన డీసీపీవో యూనిట్‌కు బెంచ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది.

బాలిక తన పెదనాన్న ఇంటివద్ద ఉండి చదువుకుంటానని చెప్పటంతో బెంచ్‌ అంగీకరిస్తూ, బాలిక విషయాన్ని పర్యవేక్షించాలని డీసీపీవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మరీదు మాధవీలత, సభ్యులు ఐకరాజు, వాసే ఆనందకుమార్, ఎస్‌ఎస్‌ రాజు, శివకృష్ణ విచారణ చేశారు. చైర్‌పర్సన్‌ మాధవీలత మాట్లాడుతూ బాలల హక్కులను హరించేవిధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవని తెలిపారు. సంప్రదాయాల ముసుగులో బాలల హక్కులను కాలరాస్తే క్షమించేదిలేదన్నారు. డీసీపీవో సూర్యచక్రవేణికి సమాచారం వచ్చినా స్పందించలేదని, పోలీస్‌ అధికారులకు కూడా మేజర్‌ అంటూ చెప్పటం సరికాదన్నారు. ఈ విషయంపై డీసీపీవో యూనిట్‌కు నోటీసులు జారీ చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు