సైబర్‌ కీచకుల ఆటకట్టు

24 Nov, 2019 03:38 IST|Sakshi

ఫేస్‌బుక్‌లో సరదాగా పోస్టు చేసిన ఫ్యామిలీ ఫొటోలోని ఆమె ముఖాన్ని కాపీ చేసి అసభ్య చిత్రాలకు జత (మార్ఫింగ్‌) చేశాడు ఒక సైబర్‌ కీచకుడు. తాను చెప్పినట్టు చేయకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని విశాఖకు చెందిన ఓ యువతిపై వేధింపులకు దిగాడు. మీరు అందంగా ఉంటారు. మిమ్మల్ని కలవాలనుంది అంటూ వాట్సాప్‌ చాటింగ్‌ ద్వారా గుంటూరుకు చెందిన ఓ వివాహితపై అసభ్య పదజాలంతో మరో పోకిరీ ఆగడాలు..   

.. ఇలా రాష్ట్రంలో మహిళలే లక్ష్యంగా ‘సైబర్‌’ కీచకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఇలాంటి వారి పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ డి. గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షణలో ‘సైబర్‌ మిత్ర’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. మహిళలు, బాలికల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపడంతోపాటు ‘సైబర్‌’ కీచకుల ఆటకట్టించే చర్యలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ‘సైబర్‌మిత్ర’ పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటుచేసింది. దీనిపై మహిళలు, చిన్నారుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెలగపూడి, విశాఖపట్నం, విజయవాడలో ఈ సదస్సులు జరిగాయి.    
 –సాక్షి, అమరావతి 

మూడేళ్లలో కేసులు రెట్టింపు 
సామాజిక మాధ్యమాల కారణంగా మహిళలు చైతన్యంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా పోలీసు రికార్డులకెక్కుతున్న సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోంది. 2016లో మహిళలపై వేధింపులకు సంబంధించి 160 సైబర్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది అక్టోబర్‌ 30 వరకు 291 నమోదయ్యాయి. ఇలా వేధింపులకు గురవుతున్న వారిలో 70 శాతం మంది 20 ఏళ్లలోపు యువతులే కావడం గమనార్హం. కాగా, ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఓ వాట్సప్‌ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఈ నెంబర్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చెయ్యొచ్చు. ఇలా ఫిర్యాదు చేసినవారి వివరాలను గోప్యంగా ఉంచుతారు కూడా. 

ఇవీ జాగ్రత్తలు.. 
- అపరిచితుల ఫ్రెండ్‌ రిక్వెస్టులు, వాట్సాప్‌ చాటింగ్‌లకు స్పందించకుండా ఉంటే మేలు.  
ఫోన్లకు సోషల్‌ మీడియా ద్వారా అపరిచితులు పంపే లింకులను ఓపెన్‌ చేయకూడదు. దీనివల్ల మన ఫోన్‌ను హ్యాక్‌చేసి వ్యక్తిగత సమాచారం, ఫొటోలు చోరీచేసే ప్రమాదం ఉంది.  
యాప్‌లు గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోకూడదు. 
సామాజిక మాధ్యమాల్లో మహిళలు, యువతులు ఫొటోలు అప్‌లోడ్‌ చేయకపోవడం మంచిది. 
అపరిచితులకు ఫోన్‌ నెంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను షేర్‌ చేయకూడదు. 

 అప్రమత్తతే మహిళలకు ప్రాథమిక రక్షణ 
సామాజిక మాధ్యమాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలి. ఫొటోలు షేర్‌ చేయడం, పోస్టు చేయడం వంటి విషయాల్లో సాంకేతిక భద్రత అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అవే ఫొటోలను సైబర్‌ నేరగాళ్లు తీసుకుని అశ్లీల ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి వేధింపులకు పాల్పడొచ్చు. బాధితులు మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం.. విశాఖపట్నం, విజయవాడలలో ఉన్న సైబర్‌ పోలీస్‌స్టేషన్లతోపాటు, ఇతర పోలీస్‌స్టేషన్లు, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.  
– మేరీ ప్రశాంతి, ఎస్పీ, సైబర్‌ మిత్ర వింగ్‌ 

ఇంట్లో నుంచే ఫిర్యాదు చెయ్యొచ్చు 
ఆన్‌లైన్‌ వేధింపులకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లపై బాధిత మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 ఫిర్యాదు చెయ్యొచ్చు. ఈ నెంబర్‌కు రోజుకు సగటున 23–27 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాట్సాప్, ఈ–మెయిల్, ఇంటర్నెట్, తదితర అన్ని ఆన్‌లైన్‌ వేధింపులపైన ఐటీ యాక్ట్‌–2000 ప్రకారం, ఐపీసీ సెక్షన్లపై కేసులు నమోదు చేస్తున్నాం.  
– కేజీవీ సరిత, ఏఎస్పీ, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌

మరిన్ని వార్తలు