మీ వివరాలు చెప్పారో.. దోచేస్తారు

28 Aug, 2019 07:47 IST|Sakshi
సైబర్‌ చోరీలపై ఆటోలో ప్రచారం నిర్వహిస్తున్న పోలీసులు

ఇటీవల సైబర్‌ నేరాలు ఎక్కువ అయ్యాయి. ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని అధికమొత్తం డబ్బు ఎరవేసి వారి నుంచే వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడో కాదు.. నియోజకవర్గంలో సైతం పెరిగిపోయాయి.  

సాక్షి, రామచంద్రపురం(తూర్పుగోదావరి) : ‘‘ హలో మీ పేరు సుస్మితేనా...?’ ‘అవునండీ .. ఎవరండీ మాట్లాడేది..?’ ‘నేను  ఇన్సూరెన్సు(ఇన్సూరెన్సు పేరు చెప్పరు)కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు చనిపోయారా?’ ‘అవునండీ.. చనిపోయి నాలుగు నెలలయ్యింది. అయినా ఎందకడుగుతున్నారు?’ ‘మీ నాన్నగారి పేరు మీద లక్ష రూపాయలు ఇన్సూరెన్సు ఉంది. ఆ డబ్బులు మీ అక్కౌంట్లో జమ చేయాలి. మీ అక్కౌంటు నంబర్, ఏటీఎం కార్డు నంబర్‌  చెబుతారా?’ ‘ఆ( చెబుతాను రాసుకోండి.’ ‘సరే నండి.. మీ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. వెంటనే చెప్పండి.’  ‘అలాగే నండి... ఓటీపీ వచ్చింది.. 1255 రాసుకొండి.’ ‘ఓకే నండి రాసుకున్నాను.. మీ అక్కౌంట్‌లో మొదట రూ. 2వేలు కట్‌ అవుతాయి. ఆ తరువాత లక్ష రూపాయలు జమవుతాయి.’  

ఈ సంభాషణ అనంతరం ఏటీఎం కార్డు నంబర్, మొబైల్‌ నంబర్‌కు  ఓటీపీ నంబర్‌ను అవతలి వ్యక్తికి చెప్పిన మరుక్షణం ఆమె ఖాతాలో నుంచి రూ. 20వేలు కట్‌ అయ్యాయి. అంతమొత్తం ఎందుకు కట్‌ అయ్యిందని ఫోన్‌ చేద్దామంటే అవతలి వ్యక్తి ఫోన్‌ లిప్టు చేయడు. ఫోన్‌ కలువదు.. ఇదీ ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్‌ నేరం. ఓఎల్‌ఎక్స్‌లో పాత వస్తువులు పెట్టి ఎక్కడో బెంగళూరులో ఉన్న వ్యక్తి లక్షలు కాజేయటం, జనం బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి బ్యాంకు ఖాతాలలో సొమ్ములు కాజేయటం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. బెంగళూరు, ముంబై, చెన్నై కేంద్రాలుగా ఈవిధమైన నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసగించి సొమ్ములు కాజేస్తున్నారు.  

నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణం,  కె.గంగవరం, ద్రాక్షారామలలో ఈ విధమైన నేరాలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి మోసాలు నియోజకవర్గంలో సుమారు 20 వరకు జరిగినట్టు తెలుస్తోంది. కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మరికొందరు ఎవరికీ చెప్పడం లేదు. ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ. 10 వేల నుంచి రూ. 25వేల వరకు కాజేస్తున్నారు. వచ్చిన ఫోన్‌కాల్స్‌ను బట్టి పోలీసులు విచారిస్తుంటే ఫేక్‌ అడ్రసులు ఉంటన్నాయి. ఫిర్యాదును బట్టి అటు ముంబాయి, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్ల లేక, మోసగాళ్ల ఆచూకీ లభ్యం కాక పోలీసులు పడుతున్నపాట్లు వర్ణనాతీతం. ఓఎల్‌ఎక్స్‌లో పాత వాహనాలను అమ్ముతాము. విడతలవారీగా సొమ్ములు చెల్లించాలని పోస్టింగ్‌లు పెట్టి, రెండు మూడు సార్లు బ్యాంకు అక్కౌంట్లో డబ్బులు కూడా వేసిన తరువాత ఆ వస్తువు లేక, డబ్బులు పోగొట్టుకున్న వారు ఎందరో.  
అప్రమత్తమైన పోలీసులు: ఈ విధమైన సైబర్‌ నేరాల నుంచి ప్రజలకు చైతన్యపరచేందుకు రామచంద్రపురం పోలీసులు నడుంబిగించారు. మోసగాళ్ల ఆచూకీ  తెలియక సతమతమయ్యే కన్నా సైబర్‌ నేరాలకు గురికాకుండా ప్రజలను చైతన్యం చేసే దిశగా రామచంద్రపురం సీఐ పెద్దిరెడ్డి శివగణేష్‌ నేతృత్వంలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. గుర్తు తెలియనివారికి ఏటీఎం కార్డు నంబర్లు, ఓటీపీ నంబర్లు ఇవ్వకూడదని, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పకూడదని రామచంద్రపురం పట్టణంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి రామచంద్రపురం పట్టణంతో పాటు
పరిసర ప్రాంతాలలో ఆటో ద్వారాను ప్రధాన రహదారుల్లోను పోలీసు సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. 

అప్రమత్తంగా ఉండండి 
అపరిచిత ఫోన్‌ కాల్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా బ్యాంకు వివరాలు అడిగితే చెప్పవద్దు. మీ బ్యాంకు అక్కౌంట్ల నుంచి మీ ద్వారానే సొమ్ములు కాజేస్తున్నారు. చోరీ జరిగిన తరువాత కంటే ముందుగానే ప్రజలు అప్రమత్తంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నాం. దీనిపై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
– పెద్దిరెడ్డి శివగణేష్, సీఐ, రామచంద్రపురం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా