‘నెట్టి’ంట్లో నేరాలు

7 Jan, 2015 04:06 IST|Sakshi

ఒంగోలు క్రైం : సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో... అంతే వేగంతో సైబర్ నేరాలు జిల్లాలో పెరిగిపోతున్నాయి.  ఇంట్లో నుంచి బయటకు రాకుండానే కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్న అక్రమార్కులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా లక్షలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు, పొగాకు వ్యాపారులు దీనికి బాధితులుగా మారుతున్నారు. విదేశాలతో లావాదేవీలు జరిపే సమయంలో పూర్తిగా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న హ్యాకర్లు కోట్ల రూపాయలను కాజేస్తున్నారు.. విదేశాల్లో ఉండి ఇలాంటి మోసాలకు పాల్పడటంతో పోలీసులకు తలకుమించిన భారంగా మారుతోంది.
 
 హ్యాకింగ్ ఎలా చేస్తారు...
 అపరిచిత చిరునామాలనుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కొద్దిగా పేరు మార్పుతో (ఒక అక్షరం అటూ ఇటుగా ) మనం లావాదేవీలు నడిపే సంస్థ పేరుతో మెయిల్స్ వస్తుంటాయి. వీటిని పొరపాటున చూసుకోకుండా ఓపెన్ చేస్తే, మీ పాస్‌వర్డ్ ఒకసారి సరి చూసుకోమంటూ మెసేజ్ వస్తుంది. దీంతో మనం మన పాస్‌వర్డ్‌ను టైప్ చేస్తే ఆ పాస్‌వర్డ్‌ను వారు సొంతం చేసుకుని దాని ద్వారా మెయిల్‌ను హ్యాక్ చేస్తారు. ఒక్కోసారి  మీ మెయిల్‌ను బయటివారు తెరవడానికి ప్రయత్నించారంటూ మెసేజ్ వస్తుంది. దీన్ని తెరిచే ప్రయత్నం చేసినా మీ మెయిల్ హ్యాక్ అవడం ఖాయం. ప్రత్యేకించి ఈ మెయిల్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, బిజినెస్ చేసేవారు కొత్త మెయిల్స్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
 
 ఎవరు చేస్తారు...
 ఈ మెయిల్స్ ఎక్కువగా నైజీరియా నుంచి, యునెటైడ్ కింగ్‌డమ్ (బ్రిటన్) నుంచి వస్తున్నాయి. నైజీరియన్స్ ఎక్కువగా ఈ విధంగా ఈజీమనీకి అలవాటుపడి ఆయా ఖాతాలను హ్యాక్ చేసే పనిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
 
 పట్టుకోవడం కష్టమే...
 మెయిల్‌ను ఎవరు హ్యాక్ చేసింది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. జిల్లాల్లో జరిగినపుడు వారికి ఉన్న సాంకేతిక పద్దతులతో కేసులను డీల్ చేయడం సులభమే. ఇతర దేశస్తులు ఈ తరహా నేరాలకు పాల్పడితే పట్టుకోవడం పెద్ద ఇబ్బందే.  సీఐడీ ద్వారా సీబీఐ ...అక్కడి నుంచి ఇంటర్‌పోల్ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇంత జరిగినా వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ముందు జాగ్రత్త పడటం చాలా అవసరం
 
 జిల్లాలో నేరాలు ఇలా...     
 ప్రకాశం జిల్లాలో ఇటువంటి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొగాకు, గ్రానైట్ వ్యాపారులను సైబర్ క్రైం ద్వారా మోసం చేసిన ఘటనలు నాలుగైదు జరిగాయి. ఏడాదిన్నర క్రితం ఇండియన్ టుబాకో అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ పొగాకు వ్యాపారి బెల్లం కోటయ్య మోసపోయారు. ఇదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇతనికి రావాల్సిన టుబాకో అమ్మకం మొత్తంలో రూ. 3 కోట్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నగదు గల్లంతయింది. ఈ కేసును పోలీసులు ఛేదించగలిగారు. రూ.3 కోట్లలో కేవలం రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేసుకోగలిగారు.  మూడు రోజుల క్రితం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, వ్యాపారవేత్తలను సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నెంబర్ల పేరిట మద్దెల దీపుబాబు వేసిన గాలానికి చిక్కి గిలగిల్లాడిపోయారు. తాజాగా ప్రముఖ గ్రానైట్ వ్యాపారి ఒంగోలులోని గోపాలనగర్ 4వ లైనులో నివాసం ఉంటున్న చల్లా శ్రీనివాసరావు సైబర్ నేరస్తుడి బారినపడి 1.25 లక్షల డాలర్లు మోసపోయారు.  అంటే మన రూపాయిల్లో రూ.78.75 లక్షల విలువ.  అయితే సరుకు పంపించకపోవడంతో చైనా దేశ కస్టమర్ నష్టపోవల్సి వచ్చింది.
 
 ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్లతో అప్రమత్తం : ఎస్పీ శ్రీకాంత్
 నగదు లావాదేవీలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫర్లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ ఆన్‌లైన్ లావాదేవీలు నడిపే వారిని హెచ్చరించారు. ఒంగోలు కరూర్ వైశ్యాబ్యాంకుకు రావాల్సిన ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ యునెటైడ్ కింగ్‌డమ్‌లోని బార్ ఫ్లక్స్ బ్యాంకుకు బదిలీ కావటాన్ని గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. ఆన్‌లైన్ లావాదేవీలు నడిపేటప్పుడు అనుమానాస్పద ఈ-మెయిల్స్ వస్తే ఎలా పడితే అలా ఓపెన్ చేయకూడదని సూచించారు. ఈ-మెయిల్స్‌లో మీ అకౌంట్‌ను మరోసారి సరిచూసుకోవాలని, పదే పదే మెయిల్ పంపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి అకౌంట్ సరిచూసుకుంటే ఆన్‌లైన్ బ్యాంకు అకౌంట్లు హాంకింగ్ చేసే నేరగాళ్లు సులభంగా మోసం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.    
 

>
మరిన్ని వార్తలు