హద్దుమీరితే జైలుకే !

19 Aug, 2019 12:06 IST|Sakshi

సైబర్‌ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

అందుబాటులోకి సైబర్‌మిత్ర విభాగం

112, 118 టోల్‌ ఫ్రీ నంబర్ల ఏర్పాటు

అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు

సోషల్‌ మీడియాలో హద్దుమీరి ఇష్టానుసారం పోస్టింగ్‌లు పెట్టే వారికి పోలీసులు చెక్‌ పెడుతున్నారు. ఫేస్‌ బుక్, వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా విభాగాల ద్వారా అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసినా లేదా అసభ్యకరంగా ఫొటోలు పెట్టినా.. మహిళలను వేధించినా ఇక అంతే సంగతులు... అలా పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వం గత నెలలో అందుబాటులోకి తెచ్చిన సైబర్‌ మిత్ర ద్వారా నిందితుల ఆటకట్టించనున్నారు. కఠిన చట్టాల ద్వారా నిందితులు ఎంతటివారైనా జైలుపాలవ్వక తప్పదు.

సాక్షి, గుంటూరు :  ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురానికి చెందిన పునుగుపాటి రమేష్‌ జూలై 24న అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేల గురించి సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టాడు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్‌ క్రైం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. సైబర్‌ మిత్ర విభాగం, సీసీఎస్, తుళ్లూరు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడిని ఈ నెల 13న అరెస్టు చేసి జైలుకు పంపారు. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం పోస్టింగ్‌లు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. 

అందుబాటులో ప్రత్యేక విభాగం...
మహిళల పట్ల వేధింపులు, సోషల్‌ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టే వారిపై కొరఢా ఝళిపించేందుకు ప్రభుత్వం సైబర్‌ మిత్ర పేరుతో ప్రత్యేక విభాగాన్ని జూలైలో అందుబాటులోకి తెచ్చింది. మహిళలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 112, 118 టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీడియోలు, ఫొటోలు పంపేందుకు వీలుగా 9121211100 వాట్సాప్‌ నంబర్‌ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచారు. కొద్దిపాటి ఆధారాలతోనే సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసిన వారిని గుర్తించడం సైబర్‌మిత్ర విభాగం ప్రత్యేకతగా చెప్పవచ్చు. హద్దు మీరి వ్యవహరిస్తే.. వేటు తప్పదని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఫిర్యాదులు చేయాల్సింది ఇలా..
మహిళలు, మైనర్లు, యువతులను ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేసినా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్, సోషల్‌ మీడియాలో ఏదైనా సరే అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసినా లేదా అసభ్యకరంగా ఫొటోలు తీసినా.. వేధించినా వెంటనే మీ ఇంట్లో ఉండి సైబర్‌ మిత్రకు సమాచారం అందజేయవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలను సైబర్‌మిత్ర బృందం సభ్యులు గోప్యంగా ఉంచుతారు. సమాచారాన్ని ప్రాథమిక ఫిర్యాదుగా భావించి విచారణ కొనసాగిస్తారు. వాస్తవమని తేలితే వెంటనే బాధితురాలి నుంచి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తారు. నిందితుడిని కటకటాల వెనక్కి పంపుతారు. ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ఉంది. ముందుగా ‘ఏపీ పోలీస్‌ ఉమెన్‌ సేఫ్టీ సైబర్‌ స్పేస్‌’ అకౌంట్‌లో విధిగా యాడ్‌ కావాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు