సైబర్ క్రైమ్‌లోకి ‘జూనియర్లు’

6 Jan, 2014 01:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు చేయడంలో తమకంటూ ‘ప్రత్యేక స్థానం’ సంపాదించుకున్న నైజీరియన్లకు ‘జూనియర్లు’గా వ్యవహరించిన వారు ప్రస్తుతం సొంత దందా ప్రారంభించారు. హ్యాకింగ్ చేసే అవసరం లేని క్రైమ్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. వీటిలో ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ‘+92’ ఆధారిత నేరాలు పెరుగుతున్నాయని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ పంథాలో మోసగాళ్లు విసిరిన వల్లో పడి రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న పాతబస్తీకి చెందిన ఓ యువతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
 
 లోకల్స్ సాయంతో రెచ్చిపోయిన ‘బ్లాక్స్’...
 నైజీరియా తదితర దక్షిణాఫ్రికా దేశాల నుంచి విద్య, వ్యాపార, పర్యాటక వీసాలపై వచ్చిన నల్లజాతీయులు ఉత్తరాదిలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తిష్ట వేశారు. అక్కడ నుంచే దక్షిణాదికి చెందిన వారికి వల వేసి అందినకాడికి దండుకునే వారు. వెబ్‌సైట్స్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేయడంలో ప్రావీణ్యం కలిగిన వీరు టార్గెట్‌గా ఎంచుకున్న వ్యక్తిని సంప్రదించడానికి సిమ్‌కార్డులు, వారితో డబ్బు జమ చేయించడానికి బ్యాంక్ ఖాతాల కోసం స్థానికులపై ఆధారపడ్డారు. ఇలా నల్లజాతీయులతో జట్టు కట్టిన ‘జూనియర్లు’ ఇప్పుడు తమంతట తాముగా మోసాలు చేయడానికి సిద్ధమయ్యారు.
 
 పాకిస్థాన్ నుంచి సిమ్‌కార్డులు...
 ఐటీలో అంత ప్రావీణ్యం లేని ఈ ‘జూనియర్లు’ హ్యాకింగ్‌తో అవసరం లేని నేరాలకు తెగబడుతున్నారు. ఓ వర్గం వారిని తేలిగ్గా మోసం చేయడంతో పాటు నేరానికి సంబంధించిన ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు పాకిస్థాన్ సరిహద్దుల నుంచి ఇంటర్నేషనల్ రోమింగ్ సదుపాయం ఉన్న ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు సేకరిస్తున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో బోగస్ వివరాలతో ఖాతాలను తెరిచి రంగంలోకి దిగుతున్నారు. ఆన్‌లైన్ డేటాబేస్ నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లకు లాటరీ తగిలింది అంటూ సంక్షిప్త సందేశం ఇవ్వడంతో ‘పని’ ప్రారంభిస్తున్నారు. స్పందించిన వారితో ఫోనులో సంప్రదించి వివిధ రకాలైన ఫీజులు, కారణాలు చెప్తూ అందినకాడికి తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకుంటున్నారు. నగదు పడిన మరుక్షణే మొత్తం డ్రా చేస్తూ సిమ్‌కార్డుల్ని ధ్వంసం చేస్తున్నారు.
 
 రూ. 5 లక్షలకు ఆశపడి...లక్షన్నర పోగొట్టుకుని...
 పాతబస్తీకి చెందిన ఓ యువతికి ‘+923003339611’ నెంబర్ నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. ఆమెకు రూ.15 లక్షల లాటరీ తగిలిందని చెప్పిన మోసగాడు మరో మూడు నెంబర్లతోనూ సంప్రదింపులు జరిపాడు. నగదు నేరుగా పంపడం కుదరదని, బ్యాంకు ఖాతాలో వేయడానికి వివిధ ఖర్చులుంటాయని చెప్పాడు. ఇలా కొన్ని దశల్లో ఆమె నుంచి రూ.1.5 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన యువతి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు చేపట్టిన దర్యాప్తులో అనేక వివరాలు వెలుగులోకి వచ్చినా... నిందితుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ‘+92’తో ప్రారంభమయ్యే నెంబర్లు పాకిస్థాన్‌కు చెందినవి, వీటి నుంచి వచ్చే ఎస్సెమ్మెస్, కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజు హెచ్చరిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా