అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్‌’

18 May, 2020 03:04 IST|Sakshi

ఉత్తర కోస్తా, యానాంలో రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు 

పోర్టుల్లో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక 

మే 20 నాటికి తీరం దాటే అవకాశం 

దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘నైరుతి’ 

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర తుపాన్‌ ‘అంఫన్‌’.. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత వేగంగా బలపడి సోమవారం సాయంత్రానికి అత్యంత తీవ్ర తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. ఆ తర్వాత మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించనుంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంఫాన్‌ మే 20 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. రాష్ట్రంలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు.

అంఫన్‌ ప్రభావంతో కోస్తా, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా సోమ, మంగళవారాల్లో గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ విశాఖపట్నం సైక్లోన్‌ వార్నింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ వీవీ భాస్కర్‌ తెలిపారు. అత్యంత తీవ్ర తుపాన్‌ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్‌ సిగ్నల్‌ నంబర్‌ 5ని జారీచేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.

బంగాళాఖాతంలోకి ‘నైరుతి’
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు