తుపాన్ గండం

10 Nov, 2014 03:53 IST|Sakshi

పంట చేతికొచ్చే సమయంలో వరణుడు రైతన్న కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. తుపాన్ రూపంలో మరో గండం పొంచి ఉంచడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం జిల్లాలోని పలు చోట్ల వర్షం కురిసి ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యూర్డుల్లో మొక్కజొన్నలు, ధాన్యం పేరుకుపోయింది. తేమతో కొనుగోళ్లు నిలిచి పోగా.. మబ్బులు పడడంతో మరింత అడ్డంకి మారింది. మరో మూడు రోజులపాటు వర్ష సూచన ఉండడంతో రైతులకు ధాన్యాన్ని ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారింది.
 
జగిత్యాల అగ్రికల్చర్ : ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైన తరుణంలో వాతావరణం మబ్బులతో ఉండి వర్షాలు కురుస్తుండడంతో ఇబ్బందులు మొదలయ్యూయి. రైతులు తమ పొలాలను హార్వేస్టర్లతో కోయించి నేరుగా గ్రామాల్లోని ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీంతో ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. మబ్బులు ఉండి వర్షాలు వస్తుండడంతో ధాన్యంపై కప్పేందుకు కవర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఐకేపీ కేంద్రాలన్నీ మామూలు వ్యవసాయ భూముల్లోనే నిర్వహిస్తుండడం, కవర్లు లేక ధాన్యం మట్టిలోనే పోస్తుండడంతో వర్షానికి తడిసి ముద్దయిపోతోంది. భూమిలో తేమ ఉండడంతో పొలాలు కోతకు వచ్చినప్పటికీ హార్వేస్టర్లతో కోయించలేని పరిస్థితి నెలకొంది. మరో రెండు,మూడు రోజుల వరకు వరి కోతలు, కొనుగోళ్లు లేక రైతులకు ఇబ్బందులు తప్పేట్లు లేవు.
 
పత్తి పరిస్థితి అంతంతే..


పత్తిని తీసి మార్కెట్‌కు తరలిస్తున్న తరుణంలో రైతుకు చిక్కులు మొదలయ్యూయి.  పత్తిలో తేమ ఉంటే వెంటనే నల్లగా మారుతుంది. తీసిన పత్తిలో తేమ లేకుండా ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి. మబ్బులతో పత్తిలో తేమ ఉండడంతో ఇటు ఇంట్లో పెట్టుకోలేక.. అటు మార్కెట్‌కు తీసుకెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిని మార్కెట్‌కు తీసుకెళ్తే తేమ సాకుతో ఎక్కడ ధర తగ్గిస్తారోనని ఆందోళన చెందుతున్నారు.
 
తడిసిన వరి, మొక్కజొన్న...

ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి వరి, మొక్కజొన్న తడిసిపోయింది. జగిత్యాల మార్కెట్‌యార్డులో సెలవులు ప్రకటించడంతో మొక్కజొన్న ధాన్యం లేకున్నా తేమతో కొనుగోలు చేయకపోవడంతో హబ్సీపూర్‌కు చెందిన వెంకట్‌రె డ్డికి చెందిన 50 క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిశాయి. ధరూర్, నర్సింగాపూర్ తదితర ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం బాగా తడిసింది.
 
మూడు రోజులపాటు స్వల్ప వర్ష సూచన


మరో మూడు రోజులపాటు జిల్లాకు స్వల్ప వర్ష సూచన ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డెరైక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. నవంబర్ 10న 5 మి.మీ, 11న 10 మి.మీ, 12న 5 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 18డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయి, చలి తీవ్రత పెరిగవచ్చని చెప్పారు. ఈదురుగాలులు గంటకు 5-9 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చని తెలిపారు.
 
అకాల వర్షం..తడిసిన ధాన్యం

మల్యాల : మల్యాల మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. ధాన్యం బస్తాలను లారీల్లో నింపడానికి సిద్ధమవగా వర్షం కురిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షానికి ధాన్యం కొట్టుకుపోయిందని వాపోయారు. సుమారు రెండు లారీల బస్తాల ధాన్యం తడిసిముద్దయింది.
 

మరిన్ని వార్తలు