‘ఫొని’ తుపాను ఎఫెక్ట్‌; 81 రైళ్ల రద్దు

1 May, 2019 21:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘ఫొని’ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 81 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. రెండు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది. రేపటి నుంచి భద్రక్ -విజయనగరం మధ్య రైలు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. భువనేశ్వర్ - పూరీ రైళ్ల సర్వీసులపై రేపు రాత్రి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించింది. మే 3న పూరీ, భువనేశ్వర్‌ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులకు టిక్కెట్‌ డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్టు తెలిపింది.

విజయనగరం జిల్లాలో అప్రమత్తం
ప్రచంఢంగా తీరం వైపు దూసుకొస్తున్న ఫోని తుపాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. అత్యంత తీవ్రమైన తుపాను కావడంతో విస్తారమైన వర్షాలు  భారీగా ఈదురు గాలుల నేపధ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లో మంచినీరు, విద్యుత్తు సరఫరా వంటి సహాయ చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో వెంటనే సహాయ పునరావాస చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ రహదారులతో పాటు రోడ్డు మార్గంలో ఎక్కడ అవాంతరాలు ఏర్పడ్డా వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనడానికి జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు