తీవ్ర తుపానుగా ‘గజ’!

14 Nov, 2018 04:15 IST|Sakshi

     చెన్నైకి 600 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతం

     దక్షిణ కోస్తా,రాయలసీమకు భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తూర్పు మధ్య, దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని ‘గజ’ తుపాను కొనసాగుతోంది. ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. మంగళవారం రాత్రి చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 600, నాగపట్నానికి ఈశాన్యంగా 720 కిలోమీటర్ల దూరంలో  కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలహీనపడి గురువారం (15న) మధ్యాహ్నానికి తమిళనాడులోని పంబన్‌–కడలూరు మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.

దీని ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి దక్షిణ కోస్తాంధ్రలోనూ, 15న దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కొన్నిచోట్ల మోస్తరుగానూ, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది. తుపాను నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది.  

మరిన్ని వార్తలు