హెలెన్ తీవ్రత.. 18 మంది మత్స్యకారుల గల్లంతు

21 Nov, 2013 19:20 IST|Sakshi
హెలెన్ తీవ్రత.. 18 మంది మత్స్యకారుల గల్లంతు

హెలెన్ తుఫాను దిశ మార్చుకుంది. మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉంది. ఒంగోలుకు తూర్పు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంలోను ఇది స్థిరపడింది. శుక్రవారం సాయంత్రం తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - కృష్ణా జిల్లా మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం గురువారం రాత్రి నుంచే కనిపిస్తుంది. గోదావరి జిల్లాల నుంచి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు గల తీరప్రాంతం అంతా భారీ నుంచి అతి భారీ వర్షాలు (25 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ప్రస్తుతానికి తుఫాను ఈశాన్య దిశగా కదులుతోంది. ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంత జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పూరిళ్లు, గుడిసెలు ఎక్కువగా ధ్వంసం అవుతాయని తెలిపింది. చెట్లు విరిగి పడటం వల్ల విద్యుత్తు, కమ్యూనికేషన్ లైన్లకు కూడా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి ప్రస్తుతానికి 'ఆరంజ్' హెచ్చరికను జారీచేసింది. అంటే పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని అర్థం. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని, తీరప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు.

తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సముద్రం 30 అడుగులు ముందుకుచొచ్చుకుని వచ్చింది. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. తుఫాను తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా కృష్ణా జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో 110 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని తుఫాను ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్ తెలిపారు.

మరిన్ని వార్తలు