తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్

21 Oct, 2014 12:38 IST|Sakshi
తుపాను నష్టం లెక్కలు అస్తవ్యస్తం: వైఎస్ జగన్

తుపాను నష్టం లెక్కలు సరిగా వేయలేదని బాధితులు చెబుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హుదూద్ తుఫానుతో అల్లకల్లోలంగా మారిన శ్రీకాకుళం జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. అసలు తమకు తుపాను సాయం అందలేదని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వ ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం చివరకు బియ్యం కూడా సరిగా పంపిణీ చేయలేదని మండిపడ్డారు.

రుణాలు మాఫీ చేస్తారన్న ఆశతో రైతులెవరూ రుణాలు కట్టలేదని, తీరా ఇప్పుడు మాత్రం రుణాలు మాఫీ కాక, అటు పంటబీమా కూడా దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, కరెంటు లేకపోవడంతో తాగునీటి పథకాలు పనిచేయడం లేదని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పారని, వాస్తవానికి లక్ష కోట్ల వరకు అప్పులు మాఫీ చేయాల్సి ఉంటే ఇప్పుడు కేవలం 5వేల కోట్లే ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. కేవలం రుణాల వడ్డీల కోసమే ఏడాదికి 14 వేల కోట్లు అవసరం అవుతుందని ఆయన గుర్తు చేశారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 18 మంది మరణించిన సంఘటన పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన బుధవారం వాకతిప్ప వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు