పలు రైళ్ల రద్దు

18 Dec, 2018 07:19 IST|Sakshi
రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆగిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌

రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

గంటల తరబడి రైళ్లు నిలుపుదల

దూరప్రాంతాల ప్రయాణికుల అవస్థలు

విజయనగరం టౌన్‌:     పెథాయ్‌ ప్రభావం రైల్వేశాఖపై పడింది. తుఫాన్‌ తాకిడి ఎక్కువగా ఉండడం, పెనుగాలులు వీస్తుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శాఖ పలు రైళ్లను రద్దుచేసింది. మరికొన్నింటిని దారి మళ్లించారు. వీటితో పాటు రెగ్యులర్‌గా వచ్చే ప్యాసింజర్‌ రైళ్లతో పాటు, తుఫాన్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లే రైళ్లను రద్దుచేసింది. ఆయా స్టేషన్లలో కొన్ని రైళ్లను నిలుపుదల చేసి, వాతావరణం అనుకూలంగా ఉన్న తర్వాతనే పంపిస్తోంది. ఈ మేరకు రైల్వే అధికారులు  ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా  విజయనగరం రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. తుఫాన్‌ ప్రభావంతో కేవలం రిజర్వేషన్ల ద్వారా వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు, అత్యవసరమైన ప్రయాణాలు తప్ప మరెవరూ కానరాలేదు. గాలుల తాకిడి,  మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రయాణాలు వాయిదాలు వేస్తున్నారు. విజయనగరం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను స్టేషన్‌లోనే గంటల తరబడి ఉంచేశారు.

ప్రయాణికులకు తప్పని తిప్పలు
రైళ్ల రాకపోకలకు కాస్త ఇబ్బందులు ఏర్పడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా అయ్యప్ప దీక్షాపరులు ఇరుముడులతో బయలుదేరి, గంటల తరబడి స్టేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చిన్నారులతో ప్రయాణాలు చేసేవాళ్లు, వృద్ధులు చలిగాలులకు ఇబ్బందులు పడ్డారు.

దారిమళ్లించిన రైళ్ల వివరాలు
రైలు నంబరు 20809 సంబల్‌ పూర్‌ – నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ సంబల్‌పూర్‌ నుంచి టిట్లాఘర్, రాయపూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. రైలునంబరు 22663 హౌరా –యశ్వంత్‌పూర్‌ హౌరా నుంచి ఖర్గపూర్,  టాటా, ఝార్సుగూడ, బిలాస్‌పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 18645 హౌరా– హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను హౌరా నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగూడ, బిలాస్‌పూర్, బల్లార్ష మీదుగా పంపించారు. 15906 దిబ్రూఘర్, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ను దిబ్రూఘర్‌ నుంచి ఖర్గపూర్, టాటా, ఝార్సుగుడ, బిలాస్‌పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. 22605 పురులియా– విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ను పురులియా నుంచి హిజిలి, ఝార్సుగుడ, బిలాస్‌పూర్, బల్లార్ష మీదుగా మళ్లించారు. మరికొన్ని రైళ్ల సమయ వేళల్లో మార్పులు చేశారు.

రద్దయిన రైళ్ల వివరాలిలా..
రైలు నంబరు 67292 విశాఖ – విజయనగరం ప్యాసింజర్,  67291 విజయనగరం–విశాఖ ప్యాసింజర్, 67294 విశాఖ– శ్రీకాకుళం ప్యాసింజర్,  67281 శ్రీకాకుళం రోడ్డు – పలాస ప్యాసింజర్, 67282 పలాస –విజయనగరం ప్యాసింజర్‌లను రద్దుచేశారు. 18న, 67293 విజయనగరం –విశాఖ ప్యాసింజర్‌ను రద్దుచేశారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే..
విజయనగరం రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌ నంబర్లను కమర్షియల్‌ విభాగం అధికారులు ఏర్పాటుచేశారు.
రైల్వేఫోన్‌ ద్వారా  83331, 83332, 83333, 83334
బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌ లైన్‌ : 08922–221202, 221206
బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌: 8500358610, 8500358712
ఎయిర్‌టెల్‌:  8106052987, 8106053006

మరిన్ని వార్తలు