ఫొని అప్‌డేట్స్‌: ఏపీకి తప్పిన గండం!

28 Apr, 2019 08:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : తుపాను ఫణి (ఫొనిగా కూడా వ్యవహరిస్తున్నారు) వణికిస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తూఫాను గా మారనున్న ఫొని  ప్రస్తుతం మచిలిపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం ఇప్పటికే వెల్లడించింది. అతి తీవ్ర తుపానుగా మారి.. ఫొని ఈ నెల 30 వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, అనంతరం రీకర్వ్ తీసుకొని ఈశాన్యం దిశగా వెళుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రమంగా బలపడుతున్న ‘ఫొని’  అప్‌డేట్స్‌ ఇవి..
(చదవండి: పెను తుపాను! )

హమ్మయ్యా.. ఏపీకి తప్పిన ఫొని గండం!
ఏపీకి ఫొని తుపాను గండం తప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంపై ఫొని తుఫాన్ ప్రభావం ఉండదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు  తెలిపారు. ప్రస్తుతం మచిలిపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,230 కిలోమీటర్ల దూరంలో ఫొని తుపాను కేంద్రీకృతమై ఉందని, ఈ సాయింత్రానికి మరింత బలపడి ఇది తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. రేపటికి ఇది అతి తీవ్ర తుపానుగా మరే అవకాశముందన్నారు. ఫొని ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తూ..  మే 1నుండి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనుందని చెప్పారు. రేపటి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు. క్రమేణా మే 3వరకు గాలులు వేగం పెరగొచ్చునని తెలిపారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో జారీ చేసిన రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక  ప్రస్తుతానికి కొనసాగుతోంది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిడబ్ల్యూ-2, సెక్షన్ సిగ్నల్ 5 హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వాకాడు వద్ద 15 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
నెల్లూరు జిల్లాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. తూపిలిపాలెం, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంటలోనూ సముంద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

తమిళనాడు భయపెడుతున్న ఫొని!
ఫొని తుపాను తమిళనాడును భయపెడుతోంది. చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈశాన్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ తుపాను కేంద్రీకృతమైంది. దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరప్రాంతంలో సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, పుదుచ్చేరి, కడలూరు, కారైకాల్‌, నాగపట్నం తదితర తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.


ప్రకాశం జిల్లాలో కంట్రోల్‌ రూం ఏర్పాటు
ప్రకాశం:
ఫొని తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 222100, 281720, 231222 ఫోన్‌నెంబర్లకు కాల్‌ చేయవచ్చు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

నెల్లూరులో ఎగిసిపడుతున్న అలలు..
నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావం కనిపిస్తోంది. దీంతో నెల్లూరు తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తూపిలిపాలెం, కొత్త కోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో మత్స్యకారులు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరించారు.

తీరంలో మొదలైన ఈదురు గాలులు
కృష్ణా జిల్లా:  ఫొని తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు దిశగా 1265 దూరంలో కదులుతోంది. అటు చెన్నైకి 1,080 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపాను కదలికలు వేగంగా ఉండటంతో తీరం వెంబడి ఈదురు గాలులు మొదలయ్యాయి. ఆదివారం 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండు నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా