తీరాన్ని తాకిన పెథాయ్‌ తుపాన్‌..

17 Dec, 2018 12:58 IST|Sakshi

మరో రెండు గంటల పాటు కాకినాడపై తీవ్ర ప్రభావం

సాక్షి, అమరావతి: పెథాయ్‌ తుపాన్‌ కొద్దిసేపటి క్రితం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. మరికొద్దిసేపట్లో కాకినాడ-యానాం మధ్య తుపాన్‌ తీరం దాటనుందని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. కాకినాడు, యానాం, తుని మండలాల్లో రానున్న రెండు గంటలపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తుపాన్‌ ప్రభావంతో విజయవాడలో భారీ వర్షం కురుస్తుంది.

గంటకు 80 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడిం‍చారు. మరో రెండు గంటలపాటు తుపాన్‌ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. గాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, సెల​టవర్లు, కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఆలయ ధ్వజ స్తంభం కూలిపోయింది. 

పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
తుపాన్‌ తీరం దాటే సమయంలో కొనసీమపై పెను ప్రభావాన్ని చూపుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, కాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. కాట్రేనికోనలో కారుపై విద్యుత్‌ స్తంభం కూలిపోయింది. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

మరిన్ని వార్తలు