తుపాన్లు కొత్తకాదు

28 Oct, 2013 06:44 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘కోస్తా జిల్లాలకు తుపాన్లు, వర్షాలు కొత్తకాదు. అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. తుపాన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. బాధితులందరినీ ఆదుకోవాలి’ అని తుపాన్ సహాయక చర్యల ప్రత్యేకాధికారి కరికాల వళవన్ ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆదివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోస్తా జిల్లాలకు తుపాన్లు, వర్షాలు వస్తూనే ఉంటాయన్నారు.
 
 జిల్లా యంత్రాంగం వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని కోరారు. సకాలంలో స్పందిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు వీలుంటుందని చెప్పారు. శాఖల వారీగా జరిగిన నష్టాలను అంచనావేసి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వళవన్ ఆదేశించారు. కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పంటల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలన్నారు. భారీ వర్షాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అధికారులు వారి వద్దకు వెళ్లి సాయపడాలని చెప్పారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. జీఓలోని మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందేలా చూడాలని సూచించారు.
 
 గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వర్షం నీరు నిలిచిపోవడం ద్వారా దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలున్నందున వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. వ్యాధులు రాకుండా ముందుగానే వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజలకు సురక్షితమైన నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారీ వాగులు, వంకలు పొంగుతూ ప్రమాదాలకు కారణమవుతున్న బ్రిడ్జిల మరమ్మతులకు చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. ఐదు బ్రిడ్జిల నిర్మాణాలకు 18 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఆర్టీసీకి 32 రూట్లలో రవాణా నిలిచిపోయిందని, ప్రస్తుతం 22 రూట్లలో రోడ్లను పునరుద్ధరించి బస్సులు యథావిధిగా తిరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మిగతా 10 రూట్లను త్వరితగతిన పునరుద్ధరించి బస్సులు తిరిగేలా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
 
 నష్టపరిహారం ఎందుకు అందించలేదు
 జిల్లాలో పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాత పడితే వాటి పెంపకందారులకు సకాలంలో నష్టపరిహారం అందించకపోవడంతో పశుసంవర్థకశాఖ జాయింట్ డెరైక్టర్  రజనీకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో పెంపకందారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను విడుదల చేసిందని, నష్టాలకు సంబంధించిన నివేదికలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పక్క జిల్లాల్లో ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోమని సూచించారు. భారీ వర్షాలకు మరణించిన పశువులు, గొర్రెలు, మేకలను వెంటనే పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటి కళేబరాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్‌నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు