ఇక దద్దవాడకు మహర్దశ

14 Nov, 2014 02:56 IST|Sakshi

గిద్దలూరు: వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దద్దవాడ పంచాయతీని సంసాద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకోవడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాసంలో దద్దవాడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదేళ్ల కాలంలో మూడు గ్రామాలను ఎన్నుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. అందులో దద్దవాడను చేర్చాలని కోరిన వెంటనే ఎంపీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గిద్దలూరు ప్రాంతంలో జవాన్లు అధికంగా ఉన్నారని సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగానే ఎంపీ రక్షణశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డికి నియోజకవర్గ ప్రజలు, దద్దవాడ ప్రజల తర ఫున కృతజ్ఞతలు తెలిపారు.

 రుణమాఫీపై ప్రభుత్వ తీరు దారుణం:
 ఎన్నికల సమయంలో అధి కారం కోసం టీడీపీ వ్యవసాయ రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.87 వేల కోట్లుఉన్న రుణాలను రూ.5 వేల కోట్లకు తగ్గించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు.  రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు ఒక్క అక్షరం తప్పు ఉన్నా రుణమాఫీ చేయకుండా కొర్రీ వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు రైతులను అబద్ధపు హామీలతో మోసగించేకన్నా...తన కు చేతకాదని చెప్పి వారికి క్షమాపణ చెప్పవచ్చుకదా అని ఎద్దేవా చేశారు. వేలాది మంది లబ్ధిదారులను విచారించేందుకు, వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు తీసుకునేందుకు రెండు రోజుల సమయం ఇస్తే వారు ఎలా సర్వే నిర్వహిస్తారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఈసర్వే పూర్తి చేసి 15వ తేదీలోగా బ్యాంకులో అప్‌లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిని గమనించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.  జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యంకాదని హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే చెప్పలేదన్నారు. టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చి కమిటీలు, సాధికార సంస్థల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూటకపు రుణమాఫీ హామీ వలన రైతులు తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి పరిస్థితి నెలకొందన్నారు.

రుణాలు చెల్లించకపోవడంతో పంటల బీమా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయన వెంట దద్దవాడ సర్పంచి గులాం చిన్నవీరయ్య, ఉపసర్పంచి బిజ్జం వెంకటరెడ్డి, కొమరోలు వైస్ ఎంపీపీ బి.చిన్నఆంజనేయులు, మాజీ సర్పంచి బిజ్జం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, నాయకులు రోశిరెడ్డి, నారు వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కైపా కోటేశ్వరరెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు