నాయకుల మెప్పు కోసం వేధింపులు..

13 Oct, 2017 13:42 IST|Sakshi
ఫిర్యాదు చేసిన అనంతరం డ్యూటీ వేళలో మద్యం సేవిస్తున్న వీఆర్వో

దగదర్తిలో శృతి మించిన ఎస్సై వేధింపులు

144 సెక్షన్‌ ఉల్లంఘనపై వీఆర్వో ఫిర్యాదు

తండ్రికి బదులుగా కుమారుడ్ని నిర్బంధించిన ఎస్సై

సాక్షి, కావలి: దగదర్తి ఎస్సై శ్రీనివాస్‌ విజయ్‌ ఆగడాలు శృతిమించుతున్నాయి. టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ఇతరులను వేధిస్తున్నారు. గురువారం వీఆర్వో ఫిర్యాదుపై తండ్రికి బదులుగా విద్యార్థి అయిన కుమారుడ్ని స్టేషన్‌లో నిర్బంధించడం కలకలం రేగింది. సేకరించిన వివరాల మేరకు..  దగదర్తి మండలం వెలుపోడు పంచాయతీలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 300 మందికి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. అయితే అధికారులు హద్దులు చూపకుండా తిప్పుకుంటుండడంత కొందరు భూములను సాగు చేసుకుంటున్నారు.

ఈ భూములపై కన్నేసిన కొందరు టీడీపీ నాయకుల కోరిక మేరకు ఇటీవల దగదర్తి తహసీల్దార్‌ కొన్ని సర్వేనంబర్లపై 144 సెక్షన్‌ విధించారు. అయితే టీడీపీ నాయకులతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగే వీఆర్వో గ్రామానికి చెందిన గద్దె కొండస్వామి, గద్దె మాల్యాద్రి 144 సెక్షన్‌ విధించిన భూముల్లోకి ప్రవేశించారని ఎస్సైకు గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం వీఆర్వో టీడీపీ నాయకులతో కలిసి డాబాలో కూర్చొని మద్యం సేవించే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే ఎస్సై ముందస్తు స్కెచ్‌లో భాగంగా ఫిర్యాదు రావడం ఆలస్యం సోదరులైన కొండస్వామి, మాల్యాద్రి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.

మాల్యాద్రి డెంగీతో నెల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కొండస్వామి తోడుగా ఉన్నాడు. దీంతో ఎస్‌ఐ కొండస్వామి కుమారుడైన మహేష్‌ను పట్టుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో బంధించాడు. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన  స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐను ప్రశ్నించగా కొండస్వామి స్టేషన్‌కు వస్తేనే ఆయన కుమారుడ్ని వదిలేస్తానని తెగేసి చెప్పాడు. వెలుపోడులో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూములను పలువురు సాగు చేసుకుంటుండగా, ఒక వర్గానికి చెందిన ఇద్దరిపైనే వీఆర్వో ఫిర్యాదు చేయడం, వెంటనే ఎస్సై వేధింపులకు పాల్పడటంపై గ్రామస్తులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు