అందుకే రాజకీయాలకు దూరం: దగ్గుబాటి

20 Jun, 2018 13:11 IST|Sakshi

రాజకీయ వాతావరణాన్ని మార్చారు

వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోంది

పోలవరం, పులిచింతం ప్రాజెక్ట్‌ల పనుల్లో పురోగతి వైఎస్సాఆర్‌ చలవే

మోదీ పాలనపై ప్రశంసలు

సాక్షి, విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన రాజకీయ భవిష్యుత్‌పై సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల్లో తాను ఎప్పుడూ డబ్బు పంచలేదన్నారు. పదవీకాలం ముగిసే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చానని దగ్గుబాటి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవని  నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి కనీసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు తీసుకున్నా ఓటర్లు తమ మనోభావాలకు అనుగుణంగానే ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

1983కు ముందు ఇటువంటి రాజకీయ వాతావరణం లేదని, క్రమంగా పెరిగిందన్నారు. అందుకే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాలను ఎవరూ శాశ్వతంగా శాసించలేరని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న మోసాలను, తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతోందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. 

ప్రాజెక్టులపై..
తెలంగాణలో ఓట్ల కోసం ఆనాటి ఏపీ నేతలు పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై మాట్లడలేదని దగ్గుబాటి ఎద్దేవ చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్‌ల పనుల్లో పురోగతి సాధించారన్నారు. దేవగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఓట్లు పోతాయనే భయంతో తిరస్కరించాని ఆనాటి నేతలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం కేంద్రం పరిధిలోనిదని.. అందుకే ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణ బాధ్యత కేంద్రానికే అప్పగిస్తే బాగుంటుందని సూచించారు.

మోదీ పాలనపై..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత, కుటుంబపరమైన ప్రలోభాలకు అతీతుడని అభివర్ణించారు. గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌(జీఎస్టీ) సాహసోపేత సంస్కరణగా పేర్కొన్నారు. రాజకీయ కారణాలు, ఇతర అంశాల వల్ల జీఎస్టీ విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్‌ కూడా గొప్ప నిర్ణయమే కానీ ఇన్‌కంటాక్స్ అధికారులు సరైన విధంగా నడిపించకపోవడంతో ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని వివరించారు. 

>
మరిన్ని వార్తలు