నిత్య సమరం

23 Dec, 2015 02:20 IST|Sakshi
నిత్య సమరం

హామీల అమలు కోరుతూ అంగన్‌వాడీల సమరశంఖం
పోస్టుల భర్తీ కోసండీఎస్సీ అభ్యర్థుల పోరుబాట
కనీస వేతనం కోసంవీఆర్‌ఏల నిరవధిక దీక్షలు
ఉద్యోగులుగా గుర్తించాలని గళమెత్తిన గోపాలమిత్రలు

ఉద్యమాలకు వేదికగా మారిన విజయవాడ నగరం
 
కాలే కడుపులు కాపాడమంటున్నాయి.. ఉద్యోగ భద్రత కోసం ఆక్రోశిస్తున్నాయి.. ఉపాధి కోసం ఎదురుచూస్తున్నాయి.. హామీలు అమలుచేసి ఆదుకోమంటున్నాయి.. తమ సమస్యలు పరిష్కరిస్తామని, ఉజ్వల భవిత కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ప్రభుత్వంపై పోరాటాలకు గళమెత్తుతున్నాయి. అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలు, డీఎస్సీ 2014 అభ్యర్థులు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, గోపాలమిత్రలు, ఆశా వర్కర్లు.. ఇలా ఒక్కొక్కరు రోడ్డెక్కుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. నూతన రాజధాని విజయవాడ నగరం నిత్యం బడుగుజీవుల బతుకుపోరుతో హోరెత్తుతోంది. సమరశీల ఉద్యమాలకు వేదికగా మారుతోంది. దీనిపై ప్రత్యేక కథనం.
 
లెనిన్ సెంటర్... ప్రస్తుతం హాట్‌టాపిక్. చర్చంతా ఇక్కడే. నూతన రాజధాని విజయవాడ నగరం మధ్యలో ఓ ప్రధాన కూడలిగా ఉంది. ఈ ప్రాంతం ప్రస్తుతం సమరశీల ఉద్యమాలకు వేదికైంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక్కడి నుంచే తమ వాణిని రాష్ట్ర, దేశ ప్రజలకు వినిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలతో నిరసన తెలుపుతున్నారు. ప్రజాసంఘాలు, నిరుద్యోగ యువత, ఉద్యోగ భద్రత కరువైన వివిధ విభాగాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఇక్కడే నిత్యం సమరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం.
 
 
విజయవాడ : నగరంలో నిరుద్యోగులు, భద్రత కరువైన ఉద్యోగులు నిత్యం సమరం చేస్తున్నారు. ప్రభుత్వం చాలీచాలని వేతనం ఇవ్వడం, హా మీలు నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు. వీరందరి ఆందోళనకు లెనిన్ సెంటర్ వేదికైంది. పోలీసులకు చేతినిండా పని పెరిగింది.
 
అంగన్‌వాడీల ఆందోళన

ఒక కుటుంబం బతకాలంటే కనీసం రూ.10 వేలు కావాలి. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న అంగన్‌వాడీ కార్యర్తలు, ఆయాల పరిస్థితి దీనంగా ఉంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగులు. చేసేది వెట్టిచాకిరీ. కొత్తగా అధికారంలోకి వచ్చి న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్యకర్తకు రూ.7,100, ఆయా కు రూ.4,800ల వేతనాన్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ అమలు జరగలేదు. వామపక్ష పార్టీల నేతల అండతో వీరు ఈనెల 10 నుంచి రిలే దీక్షలను లెనిన్ సెంటర్‌లో చేశారు. 18న సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించగా పోలీ సుల అణచివేత వైఖరి కారణంగా పలువురు గాయపడ్డారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించారు. పోలీసుల రాక్షసత్వాన్ని తప్పుపట్టారు. దీంతో వచ్చే సంవత్సరం హామీని నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటించినా అంగన్‌వాడీల్లో వేడి కొనసాగుతూనే ఉంది.
 
డీఎస్సీ అభ్యర్థుల..
ఉపాధ్యాయ నియామకాలకు 2014 సంవత్సరంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించారు. మెరిట్ జాబితా ప్రకటించలేదు. రాష్ట్రంలో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. రెండేళ్లయినా ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వీరు ఆందోళన బాట చేపట్టారు. ఈనెల 21న సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. 1998లో నిర్వహించిన డీఎస్సీకి ఇంతవరకు దిక్కులేదు. తప్పకుండా వీరికి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ గాలిమాటగా మారింది. దీంతో వీరు కూడా ఆందోళన చేపట్టారు.
 
కాంట్రాక్ట్ ఉద్యోగులు

ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగులను తీసుకున్నది. కొన్ని శాఖలు పది వేలు నెలకు ఇస్తుండగా కొన్ని శాఖలు ఆరు వేలు, ఐదు వేలే ఇస్తున్నాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆందోళనకు కూడా లెనిన్ సెంటర్ వేదికైంది. మంగళవారం నుంచి రిలే దీక్షలు చేపట్టారు.
 
ఆశాల దీక్షలు..
 నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలోని ఆశా వర్కర్‌లు కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. కార్పొరేషన్ వారు రూ.4,500 జీతం ఇస్తుంటే వైద్యారోగ్య శాఖ వారు రూ.10 వేలు ఇస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని తీసేసి పది వేలు ఇవ్వాలని ఆశా వర్కర్లు కోరుతూ ఆందోళన చేస్తున్నారు.
 
వీఆర్‌ఏల ఆందోళన
 రెవెన్యూ శాఖలో కీలక వ్యవస్థగా ఉన్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ల ఆందోళన 51 రోజులుగా సాగుతోంది. వీరు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. డీఎస్‌సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) ద్వారా ఎంపికైన వారు. వీరికి కూడా కనీస వేతనం లేదు. తమకు కనీస వేతనంతోపాటు ప్రమోషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోటా 30 శాతంగా ఉంది. వీరికి ప్రస్తుతం ఇచ్చే జీతం ఆరువేలు. ఈ జీతాన్ని వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లెనిన్ సెంటర్‌లో ఆందోళన చేస్తున్నారు. ఐదుగురు వీఆర్‌ఏలు రిలే దీక్షలు చేశారు. వీరిని ఈనెల 19న అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన వీఆర్‌ఏలు గుణదలోని ఒక సెల్‌టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోతామని హెచ్చరించారు.
 
 గోపాల మిత్రలు

 పశువైద్య శాఖ వారు కాంట్రాక్ట్ పద్ధతిపై గోపాల మిత్రలను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పశువులకు వ్యాధులు వస్తే ఇంటి వద్దకే వెళ్లి పశువైద్యం చేస్తారు. వీరికి కూడా కనీస వేతనం అమలు జరగటం లేదు. నెలకు రూ.3,500లు జీతం ప్రభుత్వం ఇస్తున్నది. వీరు 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీరిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శనివారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు